కంటేశ్వర్ ఫిబ్రవరి 16 : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయుల సమస్యలపై పరిష్కరించే సత్తా ఉన్న అభ్యర్థిని ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో ఆశలతో కలలతో ఉద్యోగ ఉపాధ్యాయులుగా భవితను ప్రారంభించిన ఉపాధ్యాయులకు పీఎఫ్ఆర్డీఏ అనే నూతన చట్టం ద్వారా పెన్షన్ విధానం అంధకారమయం చేసి ఆశలను ఆవిరి చేసిందన్నారు.
ఒక్కరైతే ఒంటరే…ఒక్కటైతే ఉప్పెనే అనే నినాదంతో సీపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల భద్రత భరోసాని తన బాధ్యతగా మొదలెట్టిన ఈ సీపీఎస్ వ్యతిరేక మహోద్యమ ప్రయాణం అంచెలంచెలుగా ఎదిగి ఐదు రాష్ట్రాలలో పాత పెన్షన్ పునరుద్ధరణకు నాంది పలికిందని తెలిపారు. అదేవిధంగా తెలంగాణలో కూడా తాను ఎమ్మెల్సీగా బరిలో ఉన్నానని, తనను గెలిపిస్తే తప్పకుండా సీపీఎస్ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరణకు పాటుపడతానని పేర్కొన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు హామీ ఇచ్చారు. రానున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారా గెలిపించుకోవాలని కోరారు. సీపీఎస్ మహమ్మారిని అంతం చేసే మరో అడుగు దూరంలో ఉన్నామని ప్రతి ఒక్కరూ ఓటును తమ బాధ్యతగా భావించి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తప్పకుండా నిరుద్యోగ, ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని, ఉపాధ్యాయునిగా పదవీ విరమణ పొందిన తనకు ఉపాధ్యాయుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, తనను గెలిపిస్తే ఉపాధ్యాయులకు సమస్యల పరిష్కారానికి చేస్తానని హామీ ఇచ్చారు.