కానిస్టేబుల్ పరీక్షా ఫలితాల్లో ఉమ్మడి జిల్లా వాసులు ప్రతిభ చాటారు. పట్టుబట్టి కొలువు కొట్టారు. నిజామాబాద్ జిల్లాలో 648 మంది, కామారెడ్డిలో 403 మంది ఎంపికయ్యారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత శిక్షణ శిబిరాల్లో ట్రైనింగ్ తీసుకున్న వారిలో చాలా మంది ఉద్యోగాలు సాధించారు. యువత కోసం కేసీఆర్ సర్కారు భారీగా జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చింది. అన్ని విభాగాలు కలిపి లక్షకుపైగా ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు జారీ చేసింది. గ్రూప్స్‌తోపాటు పోలీసు, రెవెన్యూ, హెల్త్ తదితర విభాగాల్లో వేలాదిగా ఉన్న ఖాళీలను భర్తీ చేసింది. ఈ క్రమంలోనే ఇటీవల పోలీసు కానిస్టేబుళ్ల ఎంపిక పరీక్ష నిర్వహించి, తాజాగా ఫలితాలు విడుదల చేసింది. ఉమ్మడి జిల్లా యువత సత్తా చాటి జాబ్ సాధించారు. ఒకే ఇంట్లో నలుగురు, మరో ఇంట్లో ముగ్గురు ఇలా కలల కొలువులను దక్కించుకున్నారు.
ఎల్లారెడ్డి, అక్టోబర్ 5: ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రామానికి సురేశ్‌కు నెలరోజుల క్రితం అచ్చయపల్లి గ్రామానికి చెందిన శిరీషతో వివాహం నిశ్చయమైంది. బుధవారం వచ్చిన కానిస్టేబుల్ ఫలితాల్లో కొత్తజంట పేర్లు ఉండడంతో ఇరు కుటుంబాలు సంతోషంలో మునిగితేలాయి. పెండ్లి పనుల్లో నిమగ్నమైన రెండు కుటుంబాలకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. గురువారం సురేశ్-శిరీషల వివాహ కార్యక్రమంలో వధూవరులను ఆశీర్వదించేందుకు వచ్చిన బంధుమిత్రులు, స్నేహితులు ఔను…ఇద్దరు కానిస్టేబుళ్లు ఒక్కటయ్యారని అనడంతో నవ్వులు విరబూశాయి. వివాహనికి వచ్చిన బంధుమిత్రులు పెండ్లి శుభాకాంక్షలతోపాటు ఉద్యోగ శుభాకాంక్షలు చెప్పడం అక్కడ విశేషంగా మారింది. ఇదిలా ఉండగా తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన చిలుక పవన్ కుమార్, గాలిపురం అశోక్ సైతం కానిస్టేబుల్‌కు ఎంపిక కావడంతో గ్రామంలో సంబురాలు నెలకొన్నాయి.
మద్నూర్, అక్టోబర్ 5: పుట్టింది పేదింట్లోనే అయినప్ప టికీ కష్టపడి చదివి పోలీసు కొలువులు సాధించారు ఈ ముగ్గురు అన్నదమ్ములు. మద్నూర్ మండలం శేఖాపూర్ గ్రామానికి చెందిన శంక్పాలే సురేశ్అనితలకు ముగ్గురు కుమారులు. సురేశ్ గ్రామంలో మేకల కాపరి, అనిత వ్యవసాయం చేస్తున్నది. వీరి కుమారులైన నితిన్, సతీశ్, సచిన్ ముగ్గురూ పోలీసు కొలువులు సాధించారు. బుధవారం వెలువడిన కానిస్టేబుల్ ఫలితాల్లో సతీశ్ సివిల్, సచిన్ ఏఆర్, నితిన్ టీఎస్ఎస్పీకి ఎంపికయ్యారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల, ఇంటర్ ఆదర్శ కళాశాలలోనే విద్యనభ్యసించడం విశేషం. ఒకే ఇంట్లో ముగ్గురికీ పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం రావడంతో గ్రామస్తులు సంబురాలు జరుపుకొన్నారు.
వర్ని, అక్టోబర్ 5: వర్ని మండలం కోకల్‌దాస్ తండాలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అభ్యర్థులకు ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు వర్ని మండలానికి చెందిన 12మంది ఎంపిక కాగా, అందులో కోకల్‌దాస్ తండాకు చెందిన నలుగురు ఉద్యోగాలు సాధించారు. కోకల్‌దాస్ తండాకు చెందిన గాజీరాం-భారతీబాయి కుమార్తె బర్దావల్ రాష్ర్టాబాయి, బర్దావల్ కొడుకులు మహిందర్, బర్దావల్ రాజేందర్ ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. గాజీరాం సోదరుడు బీర్మల్-మధుబాయి సంతానమైన యశ్వంత్ కూడా కానిస్టేబుల్ కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
సిరికొండ, అక్టోబర్ 5: సిరికొండ మండలం రావుట్లలో భార్యాభర్తలకు, మైలారంలో అన్నదమ్ములకు కానిస్టేబుల్ కొలువు వరించింది. మండలానికి చెందిన సుమారు 40మంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపిక కాగా, బాజిరెడ్డి కోచింగ్ సెంటర్లో చదివిన వారు సైతం ఉద్యోగాలు సాధించడం విశేషం. రావుట్ల గ్రామానికి చెందిన భార్యాభర్తలు సుమన్సౌమ్య.. బాజిరెడ్డి కోచింగ్ సెంటర్లో శిక్షణ పొంది పోలీస్ జాబ్ సాధించారు. మైలారం గ్రామానికి చెందిన అన్నదమ్ములు బైరిగోని గిరిధర్, వాల్మీకి సివిల్స్ కానిస్టేబుల్‌కు ఎంపికయ్యారు.
ఎల్లారెడ్డి, అక్టోబర్ 5: టాంజానియాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన మాలోత్ రజిత కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యింది. లింగంపేట మండలం ఎక్కపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సంగ్యానాయక్ తండాకు చెందిన కుబ్యా-జీరిల కూతురు రజిత. డిగ్రీ చదువుతున్న సమయంలోనే పర్వతారోహణ చేసింది. చదువులో ముందుండే రజిత కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికవ్వడంతో ఎంపీటీసీ విఠల్, గ్రామస్తులు హర్షం వ్యక్తంచేశారు.