KOtagiri | కోటగిరి, మార్చి 26 : సృజన టెక్ ఫెస్ట్ లో కోటగిరి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి బహుమతి సాధించినట్లు కోటగిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు. ఈ మేరుకు ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఆయన గురువారం అభినందించారు.
హైదరాబాద్ దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 25న నిర్వహించిన విద్యార్థుల సృజనాత్మకతను వెలువరిచే రాష్ట్ర స్థాయి సృజన టెక్ ఫెస్ట్-2026 లో కోటగిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన విద్యార్థులు రెండవ బహుమతిని గెలుచుకున్నారని ఆయన పేర్కొన్నారు.
ఇందులో రాష్ట్రస్థాయిలో 13 కళాశాలల నుండి విద్యార్థులు పాల్గొన్నారని, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన విద్యార్థులు కూడా నాలుగవ బహుమతిని రాష్ట్రస్థాయిలో గెలుపొందారని తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు అభినందించారు.