ఎల్లారెడ్డి, మార్చి 1: మేడిగడ్డ బరాజ్‌లోని 20వ పిల్లర్ కుంగిన మాట వాస్తవమేనని, వెంటనే మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీరు అందించాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన చలో మేడిగడ్డ కార్య క్రమంలో భాగంగా బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం మీడి యాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు ప్రాజెక్టును పరి శీలించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి మరమ్మతులు చేపడుతామని ప్రకటించిందన్నారు. ఇది తమ మొదటి విజయమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు వృథా అంటూ మాట్లాడడం సరికాదన్నారు. ఇప్పటికీ ప్రాజెక్టు నుంచి ఐదు వేల క్యూసెక్కుల సాగు నీరు రైతులకు అందుతున్నదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకోవాలని సూచించారు. బరాజ్ వద్ద వెంటనే మరమ్మతులు ప్రారంభిస్తే రైతులకు మేలు చేసిన వారవుతారని అన్నారు.