బాన్సువాడ, జనవరి 23 : తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నా రు. ఇటీవల ఉత్తరప్రదేశ్లో కరువు ఏర్పడితే కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి బియ్యాన్ని తరలించారని పేర్కొన్నారు. బాన్సువాడ పట్టణంలో నేతాజీ సుభాస్ చంద్రబోస్ జయంతి సందర్భంగా సోమవారం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సభాపతి మాట్లాడారు. దేశంలో 90 కోట్ల మంది రైతులు, నాలుగు కోట్ల ఎకరాల భూమి ఉందన్నారు. ఇందులో పంట పండిస్తే ప్రపంచానికే అన్నం పెట్టవచ్చని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్తోపాటు పంజాబ్లో కొన్ని ప్రాజెక్టులు నిర్మించారని తెలిపారు. అనంతరం వచ్చిన ప్రధాన మంత్రులు కొత్త ప్రాజెక్టులవైపు కన్నెత్తి కూడా చూడలేదన్నారు. ఇటీవల తాను జైపూర్లో స్పీకర్ల సమావేశానికి వెళ్లగా.. అక్కడ ఎక్కడా చూసినా ఎడారే ఉందని, పంటలు లేవన్నారు. ప్రాజెక్టులు లేక పంటలు పండిస్తలేరన్నారు.
గంగా, యమున లాంటి నదుల నీళ్లు సముద్రంలోకి వృథాగా పోతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. సుభిక్ష దేశం కోసం ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని కోరారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో కట్టిన ప్రాజెక్టులతో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. అనంతరం సభాపతిని ఏఎంసీ డైరెక్టర్ ప్రతిమారెడ్డి, టీఆర్ఎస్ పట్టణ విభాగం మహిళా అధ్యక్షురాలు అనిత సన్మానించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, విండో చైర్మన్లు ఏర్వాల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్ , మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్, ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు పాత బాలకృష్ణ, హన్మాన్ వ్యాయామశాల అధ్యక్షుడు గురువినయ్ కుమార్, మహ్మద్ ఎజాస్, మున్సిపల్ కమిషనర్ కల్యాణం రమేశ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
రామ్రావ్ మహరాజ్ విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్నసభాపతి
మండలంలోని అంకోల్ తండా గ్రామంలో ఉన్న జగదాంబ సేవాలాల్ మహరాజ్ గుడి ఆవరణలో రామ్రావ్ మహరాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సోమవారం నిర్వహించగా సభాపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మానవులకు మంచి మార్గాన్ని సూచించిన వారే దేవుళ్లు అని అన్నారు. బంజారాల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన గొప్ప గురువు రామ్రావ్ మహరాజ్ అని, ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. రామ్రావు మహరాజ్ గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాడని అన్నారు. సన్మార్గంలో నడిపించిన మహానుభావుడని కొనియాడారు. బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని తండాలకు జగదాంబ సేవాలాల్ మహరాజ్ ఆలయాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేశామని తెలిపారు. మండల కేంద్రంలో రూ.5 కోట్లతో గిరిజన గురుకుల బాలుర పాఠశాలను ఏర్పాటు చేయగా..ఇందులో సుమారు 700 మంది విద్యార్ధులు చదువుకుంటున్నారని తెలిపారు. గిరిజన బాలికల కోసం బాన్సువాడ మండలంహన్మాజీపేట్ ,కోనాపూర్ వద్ద నూతనంగా రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బంజారా సంఘం అధ్యక్షుడు బద్యానాయక్, ఎంపీపీ పాల్త్య విఠల్, సర్పంచ్ బద్యానాయక్, ఎంపీటీసీ సభ్యురాలు మేనిబాయి, బీఆర్ఎస్ నాయకులు ప్రతాప్ సింగ్, రాము, సాయిలు యాదవ్, శంకర్ నాయక్, గ్రామస్తులు పాల్గొన్నారు.