ఖలీల్‌వాడి, ఏప్రిల్ 9 : నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖానతోపాటు మెడికల్ కళాశాలలో సూపర్ స్పెషాలిటీ సేవలందించేందుకు 29 మంది వైద్య నిపుణులు రానున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న జీజీహెచ్‌లో పేషంట్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వివిధ డిపార్ట్మెంట్లలో సూపర్ స్పెషాలిటీ వైద్యులను నియమిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. నాణ్యమైన వైద్యం కోసం మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే స్థానికంగా సేవలందనున్నాయని తెలిపారు.
జిల్లాకో మెడికల్ కళాశాలను తీసుకరావడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని, ఇందులో భాగంగా ఇప్పటికే 17 మెడికల్ కళాశాలలు ఉండగా, కొత్తగా మరో తొమ్మిదింటిని ఈ యేడాది ప్రారంభించనున్నట్లు వివరించారు. వీటిద్వారా ప్రజలకు వైద్యంతోపాటు విద్యార్థులకు మెడికల్ సీట్లు కూడా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వైద్య రంగంలో తెలంగాణ.. దేశానికే మోడల్‌గా నిలిచిందని, ప్రజల్లోనూ సర్కారు దవాఖానలపై నమ్మకం పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. ప్రత్యేక వైద్య నిపుణుల నియామకంతో మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయని జిల్లావాసులు హర్షంవ్యక్తం చేస్తున్నారు.