మోర్తాడ్/ఖలీల్వాడి, ఏప్రిల్ 25: ఉమ్మడి జిల్లాలో కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరాలో అత్యధికంగా 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావడం గమనార్హం.
రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో 45.5 డిగ్రీలు నమోదుకాగా, నిజామాబాద్ జిల్లా మెండోరాలో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై మూడోస్థానంలో నిలిచింది. జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, ఉదయం 8 గంటలలోపే పనులు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్లోనే ఎండలు ఇలా ఉంటే, మే నెలలో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.