ఎడపల్లి, డిసెంబర్15 : ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకున్నది. ఎస్సై పాండేరావు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దంపతులు ఒడ్డె సాయిలు (40), రేఖ వీరికి ఇద్దరు కుమారులు వరుణ్, రామ్చరణ్ ఉన్నారు. ఒడ్డె సాయిలు గతంలో ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి వచ్చాడు. అప్పుడు చేసిన అప్పులు తీరలేదు. ప్రస్తుతం రోజువారీ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడం.. అప్పుల వారి నుంచి ఒత్తిడి పెరగడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో బుధవారం రాత్రి భోజనం చేసిన అనంతరం జ్యూస్లో క్రిమిసంహారక మందు కలిపి సాయిలు, రేఖ తాగారు. అనంతరం పిల్లలకు ఇచ్చారు.
జ్యూస్ తాగుతుండగా వాసన రావడం.. తండ్రి సాయిలు వాంతులు చేసుకోవడంతో పిల్లలు పక్కింటి వారికి వెళ్లి సమాచారం అందించారు.దీంతో వారు అక్కడికి చేరుకొని అందరినీ నిజామాబాద్ జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు. బుధవారం రాత్రి చికిత్స పొందుతూ సాయిలు మృత్యువాత పడ్డాడు. రేఖ పరిస్థితి విషమంగా ఉంది. పిల్లలిద్దరూ ప్రస్తుతం కోలుకుంటున్నారు. రేఖ సోదరి యశోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పాండేరావు తెలిపారు.