శ్రీనిధి.. కామారెడ్డిలోని ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నది. రెండ్రోజుల క్రితం స్కూల్‌కు నడుచుకుంటూ వెళ్తుండగా ఉన్నట్టుండి కుప్పకూలి పోయింది. సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. దవాఖానకు తరలించి చికిత్స అందించే లోపే శ్వాస ఆగిపోయింది. 14 ఏండ్ల బాలిక గుండెపోటుతో హఠాన్మరణం చెందడం అందరినీ విస్మయానికి గురి చేసింది.
భిక్కనూరు మండలం రామేశ్వర్పల్లికి చెందిన బాల్‌చంద్రం (58) కామారెడ్డిలో స్థిరపడ్డాడు. శుక్రవారం కూతురి పెండ్లి ఘనంగా జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. శాస్ర్తోక్తంగా వివాహ క్రతువు జరుగుతుండగా, పందిట్లోనే బాల్‌చంద్రం కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు దవాఖానకు తీసుకెళ్లే లోపు గుండె ఆగిపోయింది. కూతురు వివాహం చూడకుండానే ఆయన కన్నుమూశారు.
తాడ్వాయి మండలంలో పురం లక్ష్మీపతి (38) ఐదు రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యాడు. ఇంకా బోలెడంత జీవితం ఉండగానే ఆయన ఆయుష్సు తీరిపోయింది. హార్ట్ స్ట్రోక్ ఆయనను కుటుంబానికి దూరం చేసింది.
కామారెడ్డి, ఫిబ్రవరి 21: గుండె గుబులు పుట్టిస్తున్నది. ఉన్నట్టుండి ఆగిపోతున్నది. హార్ట్ స్ట్రోక్ అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నది. ఉమ్మడి జిల్లాలో గుండెపోటు బాధితుల సంఖ్య పెరుగుతుండడం కలవరపెడుతున్నది. గత నాలుగైదు రోజుల్లోనే నలుగురు మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ గుండెపోటుకు గురవ్వడం భయాందోళనకు గురి చేస్తున్నది. కామారెడ్డిలో పద్నాలుగేండ్ల బాలిక, తాడ్వాయిలో యువకుడు, కామారెడ్డిలో మరో వ్యక్తి హార్ట్ ఎటాక్‌తో మృతి చెందడం పెను విషాదం నింపింది. ఈ క్రమంలో మన గుండె పదిలమేనా? అన్న ప్రశ్న అందరి మదినీ తొలుస్తున్నది. మారిన జీవన శైలితో హృదయానికి ముప్పు ఏర్పడిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మంచి ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయడం, యోగా, ధ్యానం వంటి వాటి ద్వారా గుండెపోటుకు దూరంగా ఉండొచ్చని సూచిస్తున్నారు.
నేటి ఆధునిక సమాజంలో ప్రతి ఒక్క రూ కాలంతో పరుగులు పెడుతున్నారు. పని ఒత్తిడితో సమయానికి తిండి, నిద్ర లేక సతమతమవుతున్నారు. చదు వు, ఉద్యోగం, కుటుంబ బాధ్యతల నడుమ అనేక రకాల మానసిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. బిజీ లైఫ్‌లో ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటు పడి పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. అదే సమయంలో శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు పెరిగి అనేక రుగ్మతలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక సమస్యలతో పాటు గుండెపోటుకు గురవుతున్నారు.
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా రోగాలకు దూరంగా ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నా రు. చక్కెర, ఉప్పుతో పాటు కొవ్వు పదార్థాలను తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. కొవ్వు, బరువు పెంచే ఆహార పదార్థాలను వీలైనంత తగ్గించాలని, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలంటున్నారు. ఓట్స్, చిరుధాన్యాలు, పీచు పదార్థాలు, తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. రోజులో కనీసం అరగంట అయినా వ్యాయామం చేయాలని, యోగా, ధ్యానం చేయడం ద్వారా ఒత్తిళ్లను జయించవచ్చని పేర్కొంటున్నారు. నీళ్లు ఎక్కువగా తాగాలని, తగినంత సమయం నిద్ర పోవాలని సూచిస్తున్నారు. తద్వారా దీర్ఘకాలిక రుగ్మతలకు దూరంగా ఉండవచ్చని చెబుతున్నారు.
మారిన జీవనశైలి వల్ల హార్ట్ఎటాక్ కేసులు పెరుగుతు న్నాయి. జంక్‌ఫుడ్, మద్యపానం, ధూమపానం వల్ల హృదయ సమస్యలు వస్తున్నాయి. పని ఒత్తిడి, మితి మీరిన టెన్షన్ల వల్ల గుండెపోటు వచ్చే అవకాశముంది. ఏ వయస్సు వారైనా కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యంపై దృష్టి సారించాలి. జంక్‌ఫుడ్‌కు, ధూమపానానికి దూరంగా ఉండాలి. రోజూ కనీసం అరగంటైనా వ్యాయామం చేయాలి. మానసిక ప్రశాంతతను అలవర్చుకోవాలి.
– డాక్టర్ అరవింద్, వైద్య నిపుణులు