Kotagiri | కోటగిరి, మే 11 : ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని, చదువు పట్ల ఆసక్తి కనబరచాలని కోటగిరి ఎంపీడీవో విష్ణు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కోటగిరి, పోతంగల్ మండలంలో సోమవారం విద్యా శాఖ ఆధ్వర్యంలో విద్య పక్షోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటగిరి లో ఎంపీడీవో విష్ణు మాట్లాడుతూ సమ్మర్ క్యాంపు ద్వారా విద్యార్థులు తమలోని వివిధ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని అవకాశం కలుగుతుందని తెలిపారు. ముఖ్యంగా బేసిక్ మ్యాథ్స్, డ్యాన్స్ మ్యూజిక్ గేమ్స్, ఆర్ట్స్, హ్యాండ్ రైటింగ్, స్టోరీ టెల్లింగ్, క్రియేటివిటీ అంశాలను నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు నిజజీవితంలో స్థిరపడేందుకు బలమైన పునాదులు ఏర్పడతాయని తెలిపారు.
పీఎం శ్రీ హై స్కూల్లో సమ్మర్ క్యాంప్ ఈనెల 11 నుంచి 25వరకు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు . ఈ సమ్మర్ క్యాంపును ఆరో తరగతి నుండి తొమ్మిదో తరగతి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోటగిరి ఎంఈఓ శ్రీనివాసరావు, పోతంగల్ ఎంఈఓ లోల శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఈ క్యాంపు ద్వారా విద్యార్థులు తమ నైపుణ్య అభివృద్ధి కోసం సాధన చేసుకోవాలన్నారు విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడం వారి ఆసక్తులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు బర్ల మధూకర్, సంధ్య హనుమాన్లు, మాజీ ఎంపీపీ గంధపు పవన్, గంట్ల విఠల్, హెడ్మాస్టర్లు శ్రీనివాసరావు ,సాయిలు, పీఆర్టీయూ కోటగిరి మండల అధ్యక్షుడు బర్ల సాయిలు, గణేష్, ఆర్షద్, మల్లికార్జున్, విజయ్ ,కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.