సరిపడా లేని మరుగుదొడ్లు.. తలుపులు లేని స్నానపు గదులు.. కిటికీలకు చిరిగిన జాలీలు.. పాఠశాల ఆవరణలో పశువులు, గొర్రెల సంచారం.. అపరిశుభ్రత.. అసౌకర్యాల నడుమ నడుస్తోందీ గురుకుల పాఠశాల. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్ మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
– లింగంపేట, ఆగస్టు 10
లింగంపేట మండల కేంద్రంలోని మహాత్మాజ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాల సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. తాడ్వాయి మం డలం ఎర్రపహడ్ గ్రామంలోని బాలుర గురుకుల పాఠశాలను మండల కేంద్రంలో అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. గతేడాది వరకు ఐదు నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలు కల్పించారు. ఈ సం వత్సరం నూతనంగా ఇంటర్ విద్యార్థులకు అవకాశమిచ్చారు. విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో సమస్యలు సైతం పెరిగిపోయాయి. విద్యార్థులు కనీసం కాలకృత్యాలు తీర్చుకోవడానికి సరైన సౌకర్యాలు లేకుండా పోయాయి. మొత్తం 451 మంది విద్యార్థులుండగా, వీరిలో 59మంది ఇంటర్, 392 మంది పాఠశాల విద్యార్థులు ఉన్నారు.
వీరందరికీ కలిపి ఆవరణలో కేవలం 16 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. దీంతో ని త్యం ఉదయం కాలకృత్యాలు తీ ర్చుకోవడానికి విద్యార్థులు అవస్థలు పడుతున్నా రు. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు ఆరుబయటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. పాఠశాల వెనుక భాగంలో కుంట ఉండడంతో విద్యార్థులకు ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. స్నానాల గదులకు తలుపులు లేకుండా పోయాయి. బాత్రూంలలో నీటి సరఫరా కోసం పైప్లైన్ ఏర్పాటు చేసినప్పటికీ నళ్లాలు బిగించలేదు. దీంతో నీటి సరఫరా లేక స్నానాల కోసం బకెట్లలో నీటిని తీసుకువెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
భోజనం చేసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోవడానికి డ్రమ్ముల్లో ఉండే నీటిని ఉపయోగిస్తున్నారు. గురుకుల పాఠశాల ఆవరణలో ప్రత్యేకంగా వంట గది, భోజనశాల లేకపోవడంతో తరగతి గదుల్లోనే వంట చేస్తున్నారు. పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో ఆవరణలో పశువులు, గొర్రెల సంచారిస్తుంటాయి. తరగతి గదుల కిటికీలకు జాలీలు చిరిగిపోయి ఉండడంతో రాత్రివేళలో దోమలతో సహవాసం చేయాల్సి వస్తున్నది. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నది. అధికారులు స్పందించి సమస్యలు తీర్చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.