మోర్తాడ్, జూలై 29: వసతి గృహాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. వసతిగృహాల్లో ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్న నేపథ్యంలో బాల్కొండ నియోజకవర్గంలోని ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్న ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండేలా చూడాలని అధికారులను కోరారు.
మంగళవా రం వేల్పూర్ మండల కేంద్రంలో హాస్టల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి అధ్యక్షతన ఎస్సీ, బీసీ హాస్టల్ అధికారులతో సలహాకమిటీ సమావేశం ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా వేముల అధికారులకు పలు సూచనలు చేశారు. హాస్టల్లో ఉంటున్న ప్రతి విద్యార్థికి నాణ్యమైన ఆహారాన్ని అందించి ఆరోగ్యంగా ఉండేలా చూడాలని సూచించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని, హాస్టళ్లలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, మరుగుదొడ్లు, స్నానాల గదులు ప్రతిరోజు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు.
అంతేగాకుండా విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి వారానికోసారి హాస్టల్ సూపరిండెంట్లు ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని, సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. నియోజకవర్గంలో 8 ఎస్సీ, 5 బీసీ హాస్టళ్లు ఉన్నాయని, వాటిని మరింత మెరుగుపర్చడానికి కృషిచేస్తామని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. సమావేశం అనంతరం అధికారులు ఎమ్మెల్యేను సన్మానించారు. సమావేశంలో అధికారులు రాజ్గంగారాం, గంగాధర్, నియోజకవర్గంలోని హాస్టల్ వెల్ఫేర్ అధికారులు పాల్గొన్నారు.