సుభాష్‌నగర్, జనవరి 13: తెలుగు ప్రజల సంస్కృతీ సంప్రదాయాల్లో సంక్రాంతి పండుగకు విశిష్ట స్థానం ఉన్నది. తెలుగువారి సంప్రదాయంలో పెద్ద పండుగ. సంక్రాంతికి సెలవులు వచ్చాయంటే చాలు విద్య, ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారంతా తమ స్వస్థలాలకు చేరుకుంటారు. విద్యాసంస్థలకు శనివారం నుంచి సంక్రాంతి సెలువులు మొదలు కావడంతో పిల్లలను చదివించేందుకు పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న తల్లిదండ్రులు కుటుంబ సమేతంగా పల్లెబాట పడుతున్నారు. పండుగ సెలవులను సొంతూరిలో గడపాలన్న ఆసక్తితో వెళ్తున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాలను కుటుంబసభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఇక్కడి కుటుంబ పెద్దలు తమ మనుమలు, మనుమరాళ్లతో సరదాగా గడుపుతూ మురిసిపోతున్నారు.
అందరినీ ఒక్కటి చేసే పండుగ సంక్రాంతి. ఎక్కడెక్కడో ఉన్నవారందరినీ పల్లెలు, గ్రామాలకు తీసుకెళ్లి మూలాల్ని గుర్తుచేసే మహాత్సవం. ఉద్యోగ, వ్యాపారాల్లో తలమునకలై ఉన్నా, ఎక్కడో సుదూరాన ఉన్నా సంక్రాంతి వచ్చిందంటే అంతా ఒక చోటికి చేరుతారు. సొంతూరిలో సంబురాల్లో మునిగితేలుతారు. పిల్లపాపల రాకతో పెద్దలు కూడా పిల్లలైపోతారు. కనుమరుగవుతున్న ఉమ్మడి కుటుంబాల స్ఫూర్తిని మూడు, నాలుగురోజులపాటు మళ్లీ ఆవిష్కరించే పండుగ సంక్రాంతి. మూడు రోజుల ముచ్చటైన వైభోగం పల్లెలోగిళ్లలోనే కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సంక్రాంతి భావోద్వేగాల పండుగ. మళ్లీ ఏడాది దాక ఆ జ్ఞాపకాలను పదిలంగా దాచుకునేలా చేసే పర్వదినం. ముంగిళ్లలో ముత్యాల ముగ్గులు పరుచుకుంటాయి. డూడూ బసవన్నల సవ్వళ్లు.. హరిదాసుల కీర్తనలు.. ఘుమఘుమలాడే పిండివంటలు.. సంక్రాంతి ప్రత్యేకతలు.
డిచ్పల్లి, జనవరి 13 : మా గ్రామంలో సంక్రాంతి పండుగను అం దరం కలిసి ఆనందంగా జరుపుకుం టాం. ఒక రోజు ముందుగానే ప్రత్యేకంగా పిండి వంటలు తయారు చేసుకుంటాం. నాలుగురోజుల పాటు ఇండ్లలో పండుగ సందడి ఉంటుంది. దూరప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులు పండుగకు ఇంటికి రావడం ఆనవాయితీగా వస్తున్నది.
-నాగలక్ష్మి, గృహిణి, ధర్మారం(బీ)
మకర సంక్రాంతి వస్తుందంటే చాలు.. రకరకాల పిండి వంటకాలను తయారు చేసేందుకు సిద్ధమవు తాం. ముఖ్యంగా అరిసెలు, చెక్క లు, పొంగలి, జంతికలు, కారప్పూస తదితర పిండివంటలు వా రం రోజుల ముందు నుంచే తయారు చేస్తారు. సంక్రాంతి ముందు రోజు భోగి మంటలు వేసి పిల్లలకు భోగి పండ్లు పోస్తాం.
-సాత్విక, ధర్మారం(బీ)
ప్రతి ఏటా సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి ఆనందంగా జరుపుకొంటాం. సంక్రాంతి వచ్చిందంటే చాలు ఊరంతా పండుగ హడావుడి కన్పిస్తుంది. దూర ప్రాంతా ల్లో స్థిరపడిన వారంతా సంక్రాంతి వేడుకలకు కుటుంబసభ్యులతో కలిసి గ్రామాలకు చేరుకుంటారు. వారం రోజుల పాటు వేడుకల్లో పాల్గొని తిరిగి వారి ప్రాంతాలకు వెళ్తారు.
– సుబ్బారావు, ధర్మారం(బీ)