డిచ్పల్లి, నవంబర్ 27 : తెలంగాణ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడంతోపాటు బీఈడీ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని పీడీఎస్యూ, టీఎన్ఎస్ఎఫ్, టీజీవీపీ, ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు టీయూలోని వీసీ చాంబర్ ఎదుట బుధవారం ఖాళీ ప్లేట్లతో నిరసన వ్యక్తం చేశారు.
విద్యార్థి సంఘాల నాయకులు డాక్టర్ పుప్పాల రవి, డాక్టర్ కర్క గణేశ్ మాట్లాడుతూ.. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న సీట్లను వీసీలు భర్తీ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఉన్నత చదువుల కోసం వివిధ ప్రాంతాల నుంచి టీయూకి వచ్చిన విద్యార్థులకు వసతిగృహాన్ని ఇవ్వకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్రెడ్డి, ప్రజాప్రతినిధులు స్పందించి ఖాళీ సీట్లను భర్తీ చేసేలా చూడాలన్నారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.