వినాయక నగర్ : నిజామాబాద్ నగరంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) 8వ తరగతి విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రసాద్( Prasad) అనే విద్యార్థి సుభాష్ నగర్లో ఉన్న ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు.
విద్యార్థి సైకిల్ పై కంటేశ్వర్ మీసేవ చౌరస్తా నుంచి స్కూల్ వైపు వెళ్తుండగా అటువైపుగా వచ్చిన ఆటో విద్యార్థిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైకిల్ పై నుంచి కింద పడిన విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాలుడిని చికిత్స నిమిత్తం నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మూడవ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదంపై ఆరా తీస్తున్నారు.