రామారెడ్డి, ఆగస్టు 15: విష జ్వరంతో విద్యార్థి మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలో చోటు చేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భూంపల్లికి చెందిన మహిపాల్, చైతన్య దంపతులు కొడుకు ఊరడి రంజిత్ (9) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో స్థానిక ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించుకోగా నయం కాలేదు. బుధవారం జ్వరం తీవ్రతరం కావడంతో మెరుగైన చికిత్స కోసం కామారెడ్డికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు.
రంజిత్ స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. విద్యార్థి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా గ్రామంలో కొన్ని రోజులుగా విషజ్వరాలు ప్రబలుతున్నట్లు తెలిసింది. పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని, అధికారుల నిర్లక్ష్యంతోనే విద్యార్థి మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రంజిత్ మృతి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకొని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పడిగెల రాజేశ్వర్రావు డిమాండ్ చేశారు.