కంఠేశ్వర్, జూలై 2 : ఇందూరు నగరంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మనిషి కనిపిస్తే చాలు వెంటపడుతున్నాయి. పలు డివిజన్లలో కుక్కల బెడద తీవ్రంగా ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ గుంపులుగా దర్శనమిస్తుండడంతో బయటికి వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. కుక్కల బెడద నివారణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నిత్యం ఏదో ఒక చోట కుక్కల దాడిలో గాయపడుతున్నారు.
నగరంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, చికెన్, మటన్‌షాప్‌ల వద్ద కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు దాడి చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. మారుతీనగర్, కంఠేశ్వర్, బ్యాంకు కాలనీ, దుబ్బ తదితర ప్రాంతాల్లో మ నిషి కనిపిస్తే చాలు వెంటపడుతున్నాయి. స్కూళ్లకు వెళ్లి వచ్చే సమయంలో పిల్లలపై దాడులు చేస్తున్నాయి.
మారుతీనగర్‌లో బుధవారం ఓ వ్యక్తి తన పిల్లలను బైక్‌పై స్కూల్‌కు తీసుకెళ్లే సమయంలో కుక్కలు ఆకస్మాత్తుగా దాడి చేయగా సదరు వ్యక్తి అప్రమత్తంగా వ్యవహరించడంతో తన పిల్లలను కాపాడుకోగలిగాడు. వారం రోజుల క్రితం కంఠేశ్వర్ బ్యాంకు కాలనీలో ఏడో తరగతి విద్యార్థి స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చే సమయంలో కుక్కలు దాడి చేయడానికి పైకి రావడంతో భయంతో గట్టిగా కేకలు వేశాడు. వెంటనే చుట్టుపక్కల వాళ్లు బయటికి రావడంతో ప్రమాదం తప్పింది. నగరంలో ఇలాంటి ఘటనలు ప్రతిరోజూ ఏదో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు స్పందించి కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కుక్కల నియంత్రణ ఏజెన్సీ సెంటర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిరోజూ ఏడు నుంచి పది ఫిర్యాదు వస్తున్నాయి. ఫిర్యాదు అందగానే సిబ్బంది రాత్రి వేళల్లో వెళ్లి నామమాత్రంగా దొరికిన కుక్కలను పట్టుకుని కొద్ది దూరంలో వదిలేస్తున్నారు. దీంతో పరిస్థితి మళ్లీ యథావిధిగా మారుతున్నది. వాటి నియంత్రణ కోసం ఎలాంటి పకడ్బందీ చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడంలేదు. ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించి కుక్కలు పట్టుకుని ఇతర ప్రాంతంలో వదిలిపెడుతున్నామని సానిటరీ ఇన్స్పెక్టర్ సాల్మన్‌రాజు తెలిపారు.
యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఏజెన్సీ (ఏబీసీసెంటర్) కాంట్రాక్ట్ గడువు ఏడు నెలల క్రితమే ముగిసినట్లు సమాచారం. గతంలో ఏజెన్సీకి కుక్కల నియంత్రణకు ఒక్కో కుక్కకు రూ.1.650 చెల్లించేవారు. కుక్కలకు బర్త్ కంట్రోలింగ్, ఆంటీస్ ఇంజక్షన్లు వేస్తూ నియంత్రణ చర్యలు చేపట్టేవారు. కాంట్రాక్ట్ గడువు ముగియడంతో ఏబీసీ సెంటర్ ద్వారా కుక్కల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని తెలిసింది.
ఏబీసీ సెంటర్ కాంట్రాక్ట్‌ను పాత ఏజెన్సీ సీడీఎంకు ఇచ్చాం. కాంట్రాక్ట్ రెన్యువల్ చేశారు. ప్రపోజల్స్ పంపిం చాలని ఏజెన్సీ నిర్వాహకులకు చెప్పాం. త్వరలోనే కుక్కల నియంత్రణకు చర్యలు ప్రారంభిస్తాం.
-దిలీప్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్