ఆర్మూర్టౌన్, ఆగస్టు 11 : నిజామాబాద్లో వీధి కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రతరమవుతున్నది. జిల్లాలో ఎక్కడో ఒక చోట రోజూ జనం కుక్కకాటు గురవుతున్నారు. ఏ వైపు నుంచి వచ్చి కుక్క కాటు వేస్తుందోనని జనం హడలిపోతున్నారు. గ్రామాలు, పట్టణాల్లోనూ అదే పరిస్థితి నెలకొన్నది. ఏటా వేలాది మంది కుక్క కాటుకు గురవుతున్నారు. పట్టణాలు, గ్రామాల్లో కుక్కల సంఖ్య అధికమవుతున్నది.
పగలు, రాత్రి అనే తేడా లేకుండా వీధుల్లో సంచరిస్తూ జనాలపై దాడి చేస్తున్నాయి. ఈ నెల 8న బోధన్ పట్టణంలోని హనుమాన్టేకిడీ కాలనీలో ఆడుకుంటున్న బాలుడిపై కుక్క దాడిచేసి గాయపర్చింది. ఈ ఘటనకు రెండు రోజుల ముందు ఇదే కాలనీలో ఆరుగురిని గాయపర్చినట్లు తెలిసింది. 6వ తేదీన ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో పలువురిని పిచ్చికుక్కలు కరిచాయి. తాజాగా ఆర్మూర్ మండలం చేపూర్లో ఏడుగురిపై కుక్కలు దాడి చేసి గాయపర్చాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి. గ్రామానికి చెందిన ఏడుగురిపై ఆదివారం ఉదయం పిచ్చికుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి.
చేపూర్ గ్రామానికి చెందిన వేల్పూ ల నర్సయ్య(50), కళ(30), పోసాని (60), లత(40), గంగారాం (60), భట్టు లాస్య(45), రాజగంగారాం (50)పై ఉదయం 10.30 గంటలకు కుక్కలు ఒకదాని వెనుక మరోటి గుంపులుగా వచ్చి దాడి చేశాయి. దాడిలో గాయపడిన వారిని స్థానికులు ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా దవాఖానకు తరలించారు. చేపూర్లో కొన్ని రోజులుగా కుక్కలు స్వైర విహారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.