బాల్కొండ, నవంబర్ 18: మండలకేంద్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మనిషి కనిపిస్తే చాలూ వెంట పడుతున్నాయి. చిన్నా పెద్దతేడా లేకుండా దాడులు చేసి, తీవ్రంగా గాయపరుస్తున్నాయి. దీంతో బయటికి వెళ్లాలంటేనే గ్రామస్తులు జంకుతున్నారు. తాజాగా సోమవారం ఇంటి బయట ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడి చేశాయి.
ముస్కాన్ (9), ఆదిత్య (4) చిన్నారులపై దాడి చేయగా.. గాయపడ్డారు. గమనించిన కుటుంబీకులు వెంటనే దవాఖానకు తరలించి చికిత్స అందించారు. మండల కేంద్రంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తుండడంతో ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. అధికారులు స్పందించి మండల కేంద్రంలో కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.