ఎల్లారెడ్డి రూరల్, జూన్ 13: ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల, వెంకటాపూర్ గ్రామాలను ఈదురుగాలులు వణికించాయి. సుమారు అరగంటపాటు కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. ఒకవైపు భారీ వర్షం, మరోవైపు ఈదురుగాలులతో గ్రామస్తులంతా భయాందోళనకు గురయ్యారు. వెల్లుట్ల గ్రామంలో గాలిదుమారానికి పశువుల కొట్టాల పైకప్పు రేకులు, విఠలేశ్వరాలయానికి చెందిన ధర్మశాల రేకులు ఎగిరిపోయాయి.
వెంకటాపూర్ గ్రామ పరిధిలోని రోడ్ల వెంట సుమారు 50 చెట్లు ఈదురుగాలులకు నేలకొరిగాయి. గ్రామంలో ఆరు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇండ్లపై రేకులు ఎగిరిపోయాయి. స్థానిక నాయకుడు గౌలపల్లి మల్లేశ్ రోడ్డుపై, గ్రామంలో కూలిన చెట్లను, విద్యుత్ వైర్లను తొలగించారు.