హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కి రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ రోజురోజుకూ దూరమవుతున్నారా? పెద్ద ఎత్తున దుమారం రేపిన ఆమె ఓఎస్డీ వ్యవహారం అనంతరం ఆ విభాగం ముఖమే చూడటం లేదా? అసలు ఆమె దూరమయ్యారా? ఎవరైనా దూరం జరుగాలని ఆదేశించారా? అన్న విషయాలపై పర్యావరణ శాఖలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొండా సురేఖ.. పర్యావరణ శాఖకు మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచీ కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకు చిన్నపాటి అవగాహన కార్యక్రమం కూడా చేపట్టలేదు. ఈలోగా ఆమె ఓఎస్డీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది.
అప్పటి నుంచే కాలుష్య నియంత్రణ మండలితో తనకు సంబంధం లేదన్నట్టుగానే మంత్రి వ్యవహరిస్తూ వస్తున్నారు. ఏ పనుల గురించైనా పీసీబీ అధికారులు తన వద్దకు రావొద్దని ఆమె బహిరంగంగానే చెప్తున్నట్టు అంతర్గత వర్గాల్లో జరుగుతున్నది. కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించిన ఏ అధికారిక కార్యక్రమాల్లోనూ మంత్రి పాల్గొనడం లేదు. తాజాగా ఎంసీఆర్హెచ్ఆర్డీలో నిర్వహించిన గాలి నాణ్యత సూచీ సదస్సుకు పర్యావరణ మంత్రి గైర్హాజరయ్యారు.
ఇటీవల జరిగిన మేడారం జాతర సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి చేపట్టిన అవగాహన కార్యక్రమాల్లోనూ ఆమె పాల్గొనలేదు. పర్యావరణ పరిరక్షణకు అధికారులు చేపడుతున్న ఏ కార్యక్రమాలకూ మంత్రి హాజరుకావడమే లేదు. దీంతో పీసీబీ ఉన్నతాధికారులు మంత్రికి ఏ సమాచారమూ ఇవ్వడం లేదనే టాక్ వినిపిస్తున్నది. దీంతో పర్యావరణ శాఖకు మంత్రి ఉన్నట్టా? లేనట్లా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో క్యాబినెట్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన శాఖను నిర్లక్ష్యం చేస్తున్నారని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్రంలో గాలి కాలుష్యం, క్షీణిస్తున్న గాలి నాణ్యతపై హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో గాలి నాణ్యత సూచీ, గాలి నాణ్యత నిర్వహణ సదస్సు నిర్వహించారు. దీన్ని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో చేపట్టారు. ఇదే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గాలి గాలుష్యంపై అవగాహన కల్పించేందుకు ఢిల్లీ నుంచి నిపుణులు సైతం హాజరయ్యారు. కానీ కార్యక్రమాన్ని ముందుండి నడిపించాల్సిన పర్యావరణ శాఖ మంత్రి సురేఖ మాత్రం హాజరుకాలేదు. పీసీబీ అధికారులకూ మంత్రి వస్తారో? రారో? అన్న సమాచారం కూడా లేదని తెలుస్తున్నది. . జాతరపై మంత్రి నుంచి ఎలాంటి సూచనలు, సలహాలు పీసీబీ అధికారులకు అందలేదని తెలుస్తున్నది.
మాజీ ఓఎస్డీ వ్యవహారం జరిగి చాలా కాలమవుతున్నా.. కాలుష్య నియంత్రణ మండలి వ్యవహారాలను మంత్రి సురేఖ పట్టించుకోకపోవడానికి అసలు కారణమేమిటి? అన్న విషయంపై తీవ్ర చర్చ జరుగుతున్నది. గొడవలు సద్దుమణిగినా ఇంకా మంత్రి దూరంగానే ఉండటంపై ఆంతర్యమేమిటి? అసలు పీసీబీ అధికారులకు, మంత్రి కొండా సురేఖ మధ్య ఏం జరుగుతున్నదనే అనుమానాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. పీసీబీలో తలదూర్చొద్దని మంత్రికి ఏకంగా ప్రభుత్వ పెద్ద నుంచే ఆదేశాలు అందాయనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నది. మంత్రితో సంబంధం లేకుండానే శాఖాపరమైన పనులు కొనసాగిస్తున్నట్టు సమాచారం.