పెద్ద కొడప్గల్(పిట్లం),సెప్టెంబర్ 19: లంబాడీల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీయడానికి కుట్ర చేస్తున్నారని లంబాడాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాదవ్ శ్రావణ్ కుమార్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన లంబాడీల హక్కుల పోరాట సమితి ఆత్మీయ గౌరవ సభకు వెళ్లకుండా పిట్లం,పెద్ద కొడప్గల్ మండలంలోని లంబాడాల హక్కుల పోరాట సమితి నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేసి, స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హక్కుల పోరాట సమితి ప్రతినిధులు పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద రోడ్డుపై ధర్నా నిర్వహించారు.
పోలీసులు డౌన్ డౌన్, జై లంబాడా జై బంజారా అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్బగా వారు మాట్లాడుతూ..హైదరాబాద్లో శాంతియుతంగా చేపట్టిన లంబాడాల హక్కుల పోరాట సమితి ఆత్మ గౌరవ సభకు వెళ్లకుండా అడ్డుకుని హౌస్ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చారని తెలిపారు. ఇదేం దౌర్భాగ్యమని, ఇదేం పాలన అని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. లంబాడాల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ అరెస్టులు చేస్తే పోరాటం ఆగిపోదన్నారు. తెల్లం వెంకట్రావు, సోయం బాపురావు కలిసి సుప్రీంకోర్టులో వేసిన కేసును ఖండిస్తున్నామని, వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో లంబాడీల హక్కుల పోరాట సమితి నాయకులు శ్రావణ్ కుమార్, గణపతి నాయక్, రమేశ్ నాయక్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.