కోటగిరి, ఫిబ్రవరి 25: బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండల ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో కోటగిరిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) స్థాయిని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. 10 పడకల నుంచి 50 పడకల ప్రభుత్వ దవాఖానగా మారుస్తూ కుటుంబ ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఎం రిజ్వీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. భవన నిర్మాణంతో పాటు ఫర్నిచర్ కోసం రూ.13 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి.
మొదట వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో..
గతంలో వైద్యారోగ్యశాఖ పరిధిలో ఉన్న సీహెచ్‌సీ ప్రస్తుతం వైద్య విధాన పరిషత్‌లో విలీనమైంది. వైద్య విధాన పరిషత్ విభాగంలోకి రావడంతో స్పెషలిస్టు డాక్టర్లతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. ప్రస్తుతం పది పడకల సామర్థ్యం ఉండగా.. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల సమయంలో కోటగిరి దవాఖాన స్థాయి పెంపు అంశాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే దీనిని 50 పడకల దవాఖానగా మారుస్తూ నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు వెలువరించారు.
ప్రత్యేక వైద్య నిపుణులతో అందనున్న సేవలు..
కోటగిరి మండల ప్రజలు మెరుగైన వైద్యం కోసం బోధన్, నిజామాబాద్ తదితర పట్టణాలకు వెళ్లేవారు. ప్రస్తుతం ఇక్కడి దవాఖాన స్థాయి పెరగడంతో కోటగిరిలోనే ఉచిత వైద్యం చేయించుకునే వీలు కలుగనున్నది. స్పెషలిస్టులతో వైద్యసేవలు అందనున్నాయి. 50 మంది సిబ్బందితోపాటు గైనకాలజిస్టు, పిడియాట్రిక్, ఆర్థోపెడిక్, కంటి, దంత, అనస్తీషియా, ఫిజీషియన్ల నియామకంతో పాటు ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ ల్యాబ్ టెక్నీషియన్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి. గతంలో కోటగిరి మండల ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి 50 పడకల దవాఖానను మంజూరు చేయించారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
మండల ప్రజల కల సాకారమైంది..
ఎన్నో ఏండ్లుగా దవాఖాన స్థాయి పెంపు గురించి ఎదురు చూస్తున్న కోటగిరి మండల ప్రజల కల సాకారమైంది. కోటగిరికి 50 పడకల ప్రభుత్వ దవాఖాన మంజూరుకు సహకరించిన సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు.
-పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర శాసన సభాపతి