ఖలీల్‌వాడి, నవంబర్ 12: వారు రాత్రింబవళ్లు కష్టపడి డీఎస్సీలో ఉద్యోగం సాధించారు. అనుకున్న లక్ష్యం నెరవేరినందుకు ఎంతో సంతోషించారు. వారి కుటుంబాల్లో చెప్పరాని సంతోషం నెలకొన్నది. కొందరు కౌన్సెలింగ్‌లో డీఈవో చేతుల మీదుగా జాయినింగ్ ఆర్డర్ అందుకోగా.. మరికొందరు హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.
కొందరు కొత్తగా పాఠశాలలో అడుగుపెట్టి విద్యార్థులకు చదువు చెప్పగా..మరికొందరు జాయినింగ్ కోసం వేచి చూస్తున్నారు. ఇంతలో విద్యాశాఖ అధికారులు పిడుగులాంటి వార్త చెప్పి.. వారిని నైరాశ్యంలోకి నెట్టేశారు. సాంకేతిక కారణాలతో పొరపాటున మీకు జాయినింగ్ ఆర్డర్ ఇచ్చామంటూ చెప్పి.. వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారు. జిల్లాలో డీఎస్సీ ఫలితాలు వెల్లడిన నాటి నుంచి గందరగోళ పరిస్థితి నెలకొన్నది. ఫలితాలపై వందల కొద్ది అభ్యంతరాలు రాగా.. వాటిని విద్యాశాఖాధికారులు పరిగణనలోకి తీసుకున్నట్లు ఎక్కడా కనిపించలేదు. సాంకేతిక లోపంతో పొరపాట్లు బహిర్గతమవుతుండడంతో ఉద్యోగాలకు ఎంపికైన వారికి చావు కబురు చల్లగా చెప్పి చేతులు దులుపుకొంటున్నారు.
కొత్తగా డీఈవోగా బాధ్యతలు చేపట్టిన అశోక్‌కుమార్ పాఠశాలలను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నా.. మిగతా విషయాలపై దృష్టిసారించడంలేదు. డీఎస్సీ ఫలితాల్లో చోటుచేసుకున్న సాంకేతిక తప్పిదాలపై ఫోన్‌ద్వారా ఆయనను సంప్రదించడానికి ప్రయత్నించగా.. ఆయన స్పందన కరువైందని వాపోతున్నారు.