పోలీసు కావాలన్న కలను నిజం చేసుకునేందుకు యువతీ యువకులు కష్టపడుతున్నారు. ప్రిలిమ్స్‌లో ఎంపికైన అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఈ తరుణంలో అభ్యర్థులు ఏవిధంగా సన్నద్ధం కావాలి, పాటించాల్సిన ఆహార నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
నిజామాబాద్ క్రైం,డిసెంబర్ 2 : ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలను సాధించేందుకు చాలా మంది అభ్యర్థులు పట్టుదలతో ఉన్నారు. ప్రభుత్వం సైతం అభ్యర్థులకు ప్రోత్సాహాన్నిచ్చేందుకు కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ సూచనల మేరకు పోలీసు శాఖ సైతం యువతకు చేయూత అందిస్తున్నది. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సాధన చేస్తున్న అభ్యర్థులకు దేశంలోనే ఎక్కడాలేని విధంగా నిష్ణాతులైన శిక్షకులతో ఉచిత కోచింగ్ ఇప్పించడమే కాకుండా వారికి అవసరమైన స్టడీ మెటీరియళ్లను సైతం అందజేసింది. ఉచిత శిక్షణ అనంతరం అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించడంతో చాలామంది ఉత్తీర్ణత సాధించారు. పోలీస్ శాఖలో జాబ్స్ కోసం పోటీపడుతున్న అభ్యర్థులకు అత్యంత ముఖ్యమైన
దేహదారుఢ్య పరీక్షలు (ఈవెంట్స్) నిర్వహించనున్నారు. ఇందులో అభ్యర్థులు సాధించిన మార్కులను సైతం చివరిగా నిర్వహించే సెలక్షన్స్‌లో పరిగణలోకి తీసుకుంటారు. ఈ నెల 8వ తేదీ నుంచి అభ్యర్థులకు పరుగు పందెం, షాట్ ఫుట్, లాంగ్ జంప్, హై జంప్, ఎత్తు, ఛాతి కొలతలు నిర్వహిస్తారు. అయితే వీటిలో అభ్యర్థులు నెగ్గాలంటే ఎలాంటి ప్రాక్టీస్ చేయాలనే అంశాలపై ప్రత్యేక కథనంతో పాటు కొత్తగా పోలీసు శాఖలో ఉద్యోగాలు సాధించిన ఎస్సైలు ఇచ్చిన సలహాలు, సూచనలు మీ కోసం..
1600 మీటర్ల పరుగును 7 నిమిషాల 15 సెకన్లలో పూర్తి చేయాలి.
లాంగ్ జంప్ : నాలుగు మీటర్లు దూకాల్సి ఉంటుంది.
షాట్‌ఫుట్ : 6 మీటర్లు (7.26 కి.గ్రా) విసరాల్సి ఉంటుంది.
800 మీటర్ల పరుగును 5 నిమిషాల 20 సెకన్లలో పూర్తి చేయాలి.
లాంగ్ జంప్ : 2.50 మీటర్లు దూకాల్సి ఉంటుంది.
షాట్‌ఫుట్ : 4 మీటర్లు (4 కేజీలు) విసరాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఈ ఈవెంట్స్‌లో కచ్చితంగా అర్హత సాధించాలి.
ఏ ఈవెంట్ అయినా ఫిట్నెస్ చాలా ముఖ్యం. కండరాలు దృఢంగా మారితేనే స్టామినా పెరుగుతుంది. రన్నింగ్‌కు ముందు మొదట స్ట్రెచింగ్, వర్కవుట్ చేయాలి. ఇలా చేయడం ద్వారా కీళ్లు కండరాలకు గాయాలు కాకుండా కాపాడుకోవచ్చు.
అభ్యర్థులు ఇది ప్రాక్టీస్ చేసే సమయంలో ముందుగా ప్రతిరోజూ 2 నుంచి 5 కి.మీ వరకు పరుగెత్తాలి. ఇలా 15 నుంచి 20 రోజులు చేసిన తర్వాత 200 మీ, 400 మీ, 600 మీ., 800 మీ., 1000 మీ., 1200 మీ.ఇలా క్రమంగా పెంచుకుంటూ ప్రాక్టీస్ చేయాలి.1600 మీ. రన్నింగ్ చివరి 400మీ. చాలా కీలకం. మొదటి రేస్ ప్రారంభమైన తర్వాత ఒకేసారి స్పీడ్‌గా వెళ్లకుండా స్థిరంగా వెళ్లాలి. 1200 మీటర్ల వద్ద వేగాన్ని పెంచుతూ రన్నింగ్ చేయాలి. దీంతో ఒత్తిడి పెరగకుండా సులువుగా లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
పరుగుతో పాటు ఎగిరే సామర్థ్యంపై ఇది ఆధారపడి ఉంటుంది. కాబట్టి లెగ్ పవర్ పెంచుకోవాలి. స్పీడ్, టేకాఫ్, ల్యాండింగ్ గురించి తెలుసుకోవాలి. రన్నింగ్ స్పీడ్ 20 మీ. నుంచి తీసుకొని గమ్యం వైపు చూస్తూ టేకాఫ్ తీసుకొని ల్యాడింగ్ అయ్యేటప్పుడు చేతులు ముందుకు పెట్టి మోకాళ్లు, బాడీని ముందుకు వంచి ల్యాండ్ అవ్వాలి. రోజుకు 5 నుంచి 10 సార్లు ఇలా చేయడం వల్ల ఉత్తమ జంప్‌ను నమోదు చేయవచ్చు.
షాట్‌పుట్‌ను ఎంత దూరం విసురుతామనేది సర్కిల్లో నిలబడడం, గుండును పట్టుకొనే విధానంపై ఆధారపడి ఉంటుంది. గుండును చేతి వేళ్ల మొదళ్లలో అనించి ఫింగర్స్‌తో మాత్రమే గ్రిప్ చేసి పట్టుకోవాలి. వేళ్లతో పట్టుకున్న గుండును చెవి వెనుక ఆనించి నెమ్మదిగా ఒక అడుగు వెనుకకు వేసి మూమెంట్ స్టార్ట్ చేయాలి. బాడీని కిందికి వంచుతూ గుండును బలంగా పుష్ చేయాలి. ఇలా రోజుకు 3 నుంచి 10 సార్లు ప్రాక్టీస్ చేయాలి.
నిజామాబాద్ నగరంలో ఈ నెల 8వ తేదీ నుంచి నిర్వహించే ఎస్సై, కానిస్టేబుల్ ఈవెంట్స్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఈ క్రింది సూచనలు తప్పనిసరిగా పాటించాలని కమిషనర్ ఆఫ్ పోలీస్ నాగరాజు సూచించారు.
అభ్యర్థులకు 1600 మీటర్ల రన్నింగ్ చాలా ముఖ్యమైనది. దీన్ని అధిగమిస్తే అనుకున్నది సాధించవచ్చు. ఒకే సారి కాకుండా ప్రణాళికా బద్ధంగా వేగాన్ని పెంచుకుంటూ నిర్దేశిత సమయానికి చేరుకునే విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసే సమయంలో శరీరానికి ఎలాంటి గాయాలు తగలకుండా జాగ్రత్త వహించాలి. తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా మంచిది. ప్రతిరోజూ గుడ్డును తీసుకోవాలి. ఆయిల్, మసాలా ఫుడ్‌కు దూరంగా ఉండాలి. డ్రై ఫ్రూట్స్, పాలు, రాగి సంకటి వంటివి తీసుకోవాలి. షాట్‌పుట్‌లో సులువుగా గెలవాలంటే ప్రతి రోజూ డిప్స్ కొట్టాలి. అంతే కాకుండా ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసే సమయంలో వార్మప్ చాలా అవసరం. స్ట్రెచింగ్ చేయాలి, మజిల్స్, బాడీని ఫ్రీ చేసుకోవాలి.
-కె.సందీప్, నిజామాబాద్ 4వ టౌన్ ఎస్సై
రన్నింగ్ సమయంలో ఎలాంటి గాయాలు కాకుండా జాగ్రత్త పడాలి. అయితే శరీరంలో ఫిట్నెస్ మాత్రమే ఉంటే లక్ష్యం సాధిచగలమనే నమ్మకం ఉండదు. ఏం జరిగినా మనం అనుకున్నది సాధించాలనే పట్టుదల మనలో ఉన్నప్పుడే విజయం వరిస్తుంది. లాంగ్‌జంప్ ప్రాక్టీస్ చేసే సమయంలో కండరాలు పట్టివేయకుండా జాగ్రత్త వహించాలి. ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్న వారిలో లాంగ్ జంప్ సమయంలో చాలా మందికి దెబ్బలు తగిలించుకుంటున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఆ విషయంలో చాలా కేర్‌గా ఉండాలి. 1600 మీటర్ల రన్నింగ్‌ను సమయంలోపు పూర్తి చేస్తే మిగతా ఈవెంట్స్‌కు అంతగా కష్టపడాల్సి అవసరం ఉండదు.
-సల్ల శ్రీకాంత్, నందిపేట్ ఎస్సై