ఖలీల్‌వాడి, జనవరి 23 : ఉద్యోగుల సహకారంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నదని రోడ్లు భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఉద్యోగులను తాము ఎన్నడూ కూడా వేరు చేసి చూడలేదని, వారితో ప్రభుత్వానికి ఉన్నది పేగుబంధం అని పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో టీఎన్జీవోస్ సంఘం జిల్లాశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీ, క్యాలెండర్లను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ నాగరాజు, మేయర్ దండు నీతూకిరణ్‌తో కలిసి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భం గా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్ర అమోఘమన్నారు.మలివిడుత ఉద్యమంలో ఉద్యోగులతో కలిసి పోరాడే అవకాశం లభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నామని, తెలంగాణ ఉద్యమానికి ఉద్యోగులు ఉత్ప్రేరకంగా నిలిచారని కొనియాడారు.
అందుకే సీఎం కేసీఆర్ ఉద్యోగుల పట్ల ఎల్లవేళలా ఉదార స్వభావంతోనే వ్యవహరిస్తారన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందంటే అందుకు ఉద్యోగుల కృషి ప్రధాన కారణమన్నారు. దేశంలోనే ఉద్యోగులకు అత్యధిక జీతాలు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా కేంద్రంలో ఉద్యోగుల కోసం అన్ని వసతులతో కూడిన కల్యాణ మండప నిర్మాణానికి రూ. కోటి నిధులు కేటాయిస్తానని అర్బన్ ఎమ్మెల్యే బిగాల ప్రకటించగా, తన వంతు సహకారం అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ మంజుల, టీఎన్జీవోస్ సంఘం బాధ్యులు, అన్ని శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.