నిజామాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ; అకాల వర్షం అన్నదాతను ఆగమాగం చేసింది. ఈదురుగాలులతో కూడిన వాన..రైతన్నకు తీరని నష్టాన్ని మిగిల్చింది. శుక్ర, శనివారాల్లో కురిసిన అకాల వర్షంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చెడగొట్టు వానలకు తోడుగా గాలి దుమారం తీవ్రంగా చేటు చేసింది. దీంతో ఆరుగాలం సాగుచేసిన పంట చేతికొచ్చే సమయంలో వర్షానికి నేలకొరిగింది. పంటకు పెట్టిన పెట్టుబడి కూడా మిగలకపోవడం రైతన్నను కంటి తడి పెట్టిస్తోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తేమ పేరుతో ఇబ్బందులు పెడుతుండడంతో వడ్ల రాశులను ఎండకు ఆరబెట్టగా అకాల వర్షంతో భారీ నష్టం వాటిల్లింది. చాలాచోట్ల కళ్లముందే వర్షపు నీటిలో వడ్లు కొట్టుకుపోవడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని, రైతన్న తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే.. ఎన్నికల హడావుడిలో ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ కార్యక్రమాల్లో అధికార పార్టీ నేతలు గడుపుతున్నారు. నష్టపోయిన అన్నదాతలకు అండగా నిలువకపోవడం గమనార్హం.నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలకు 623 మంది రైతులకు చెందిన 907 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి వాజిద్‌హుస్సేన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 81 మంది రైతులకు సంబంధించి 114 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు జిల్లా వ్యవసాయ అధికారిణి భాగ్యలక్ష్మి తెలిపారు.
అపార నష్టం..
మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట, సోమార్పేట క్లస్టర్ల పరిధిలో 120 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు కామరెడ్డి ఏడీఏ అపర్ణ చెప్పారు. మాక్లూర్ మండలంలో రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. కోతకు వచ్చిన పంట నేలకొరిగింది. మామిడికాయలు నేల రాలాయి. ధాన్యం కుప్పలు కొట్టుకుపోయాయి. నందిపేట్ మండలంలో 50 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 5 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. వడగండ్ల వానతో 230 ఎకరాల్లో వరి, ఐదు ఎకరాల మామిడి పంటకు నష్టం వాటిల్లింది. నవీపేట మండలంలో దాదాపు 80 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యం నీళ్లపాలైంది. 25 విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. ఈదురు గాలులకు ధర్మారాం గ్రామంలో మూడు రేకుల షెడ్లు దెబ్బతిన్నాయి. కమ్మర్పల్లి మండలంలో వరితోపాటు నువ్వులు, సజ్జ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అమీర్‌నగర్, సర్పంచ్ తండా గ్రామాల్లో నివాస గృహాలు, గుడిసెలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. నిజామాబాద్ రూరల్ మండలంలోని కాలూర్, కొండూర్, తిర్మన్‌పల్లి, జలాల్పూర్, ఖానాపూర్ గ్రామాల్లో కోతకు వచ్చిన వరి ఈదురుగాలులకు నేలకొరిగింది. 187 ఎకరాల పంట నష్టం జరిగింది. కాలూర్, జన్నేపల్లి, అశోక్ఫారం రహదారులపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దెబ్బ తిన్న పంటలను జిల్లా వ్యవసాయాధికారి వాజిద్ హుస్సేన్ శనివారం పరిశీలించారు. డిచ్పల్లి, ఇందల్వాయి మండలాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యాన్ని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పరిశీలించారు. రైతులకు జరిగిన నష్టాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఇందల్వాయి, రెంజల్, మోర్తాడ్, ఏర్గట్ల, ధర్పల్లి మండలాల్లో కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసిముద్దయ్యింది. ఎప్పుడు కొంటారో తెలియక.. వేచిచూసి నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం చూస్తే దళారులకే ధాన్యం విక్రయించడం మంచిదని భావిస్తున్నారు.
గంటైతే వడ్లు పోయేటివి..
మేము ఐదు ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నం. ఐదు రోజుల కిందట వరి కోపిచ్చినం. ఆరబెట్టుకుని తీసుకు రావాలంటే కల్లాల్లో వడ్లు ఆరబోసినం. ఒక గంట అయితే మా పంటను అమ్ముకుంటుండే. అసుంటిది క్షణాల్లో వానొచ్చి మొత్తం వడ్లను తడిపేసింది. గింజలు చేతికి వస్తలేవు. ఏమీ తోస్తలేదు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.
– కోరుట్ల లక్ష్మి, మహిళా రైతు, కొండూర్, నిజామాబాద్ రూరల్
ప్రభుత్వాలు ఆదుకోవాలి..
ఇందల్వాయి: వ్యవసాయాన్నే నమ్ముకొని బతుకుతున్నం. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఆరుంగాలం కష్టపడి పంట చేతికందే సమయంలో పంట మొత్తం వర్షంపాలైంది. తడిసిన వడ్లను కోత పెట్టకుండా మద్దతు ధరతోని కొనాలె.
-గురిజాల నవీన్, ఇందల్వాయి
వడ్లన్నీ కొట్టుకుపోయినయ్..
మాచారెడ్డి: రెండు నెలల క్రితం నీళ్లందక పంట కొంత ఎండిపోయింది. పంటను కోసి కొనుగోలు కేంద్రానికి తెచ్చిన. 15 రోజుల నుంచి ఎవ్వరూ పట్టించుకుంటలేరు. వడ్లన్నీ కొట్టుకు పోయినయ్.
-భూక్యా శంకర్, రోటిబండ తండా, సోమార్పేట, మాచారెడ్డి మండలం
అప్పులెట్ల కట్టాలె..
ఇందల్వాయి: అకాల వర్షాలతోని కొం త పంట పొలంలోనే దెబ్బతిన్నది. ఇప్పుడేమో.. కొసి తెచ్చిన వడ్లన్నీ తడిసిపోయినాయి. చాలా నష్టపోయినం. ఎవుసాన్ని నమ్ముకొని అప్పుచేసి పెట్టుబడి పెట్టినం. మా కష్టమంతా నీళ్లపాలైంది. అప్పులెట్ల కట్టాలె. సర్కారే నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలె.
-బెస్త రాధ, ఇందల్వాయి
ఒర్రెలకు కొట్టుకుపోయినయ్..
మాక్లూర్: నాకు ఎకరం పొలం ఉంది. వారం రోజుల నుంచి ధాన్యాన్ని ఆరబెడుతున్న. వడ్లు కాంటా పెట్టలేదు. రేపు మాపు అంటున్నరు. ఇంతలోనే వర్షానికి వడ్లన్నీ పక్కనే ఉన్న ఒర్రెలోకి కొట్టుకపోయినయ్. కష్టమంతా ఉత్తదే అయ్యింది.
-రాథోడ్ లీల, సింగంపల్లి, మాక్లూర్ మండలం
బోనస్ కోసం మోసపోయినం..
రెంజల్: వరి కోసి కొనుగోలు కేంద్రం దగ్గర రోజూ ఎండపెడుతున్నాం. కాంగ్రెస్ సర్కారు 500 బోనస్ ఇస్తమంటే ఎదురు చూస్తున్నం. కానీ మొదటికే మోసం వచ్చింది. వర్షానికి వడ్లన్నీ తడిసిపోయినయ్. జల్దీ కాంటా పెడ్తలేరు. వర్షం వస్తే వడ్ల మీద కప్పడానికి ఇక్కడ తాటిపత్రులు కూడా లేవు.
-పిట్ల గంగాధర్, సాటాపూర్, రెంజల్ మండలం