మోర్తాడ్, మార్చి16: విద్యుత్ ఉత్పత్తిలో ఎస్సారెస్పీ జలవిద్యుత్ కేంద్రం మరోమారు లక్ష్యాన్ని చేరుకున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి పంటలకు నీటివిడుదల కొనసాగుతుండడంతో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం చేరుకునే అవకాశం కలిగింది. 2024-25 సంవత్సరానికి 62 మిలియన్ యూనిట్ల లక్ష్యాన్ని జెన్కో అధికారులు నిర్ణయించారు. కాగా ఇప్పటికే లక్ష్యాన్ని పూర్తిచేసుకున్నది.
వరుసగా ఐదు సంవత్సరాలపాటు నిర్ణయించిన లక్ష్యాన్ని చేరుకుంటున్నది. ఎస్సారెస్పీ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 2020-21 సంవత్సరంలో 90.7656 మిలియన్ యూనిట్లు, 2021-22లో 109.8417, 2022-23లో 138.9208, 2023-24లో 75.8692 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం లో నాలుగు టర్బయిన్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది.
ఒక్కో టర్బయిన్ ద్వారా తొమ్మిది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది. ప్రాజెక్ట్ నిర్మించిన అనంతరం విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉండడంతో జెన్కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 1991 సంవత్సరంలో రికార్డు స్థాయిలో 146.43 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. విద్యుత్ ఉత్పత్తి విషయంలో లక్ష్యాన్ని చేరుకోవడంతో పా టు ఇంకా యాసంగి పంటలకు నీటివిడుదల కొనసాగే అవకాశం ఉండడంతో విద్యు త్ ఉత్పత్తికూడా పెరిగే అవకాశం ఉన్నది. ఈ సంవత్సరం కూడా విద్యుత్ ఉత్పత్తిలో లక్ష్యాన్ని చేరుకోవడంతో జెన్కో అధికారులు, సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.