కంఠేశ్వర్/ కామారెడ్డి, డిసెంబర్ 15 : సీఎం రేవంత్రెడ్డి తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతున్నది. సమ్మెలో భాగంగా ఆదివారం వారు కండ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం తొమ్మిది రోజులుగా నిరసనలు, సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కస్తూర్బా విద్యాలయంలో బోధన నిలిచిపోయినా కళ్లుండి కబోదిలా వ్యవహరిస్తున్నదని, అందుకే తాము కండ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు.
ఇచ్చిన హామీని సీఎం రేవంత్రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో ప్రజా సంఘాల మద్దతుతో సమ్మెను ఉధృతం చేసి, విద్యా వ్యవస్థను స్తంభింపజేస్తామని హెచ్చరించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సమ్మె శిబిరంలో ఉద్యోగులకు తపస్ ప్రతినిధులు మద్దతు ప్రకటించి అండగా ఉంటామన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద చేపట్టిన సమ్మె శిబిరంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు, తపస్ జిల్లా నాయకులు కిషన్, నర్సయ్య, రమేశ్, సాయన్న, శివప్రసాద్, విజయ్, భూపేందర్, ప్రకాశ్, గంగామణి, అఫ్సర్, రవికిరణ్, జాన్ సత్యపాల్, గంగాధర్, ప్రభు, రాణి, సుప్రజ, పద్మ పాల్గొన్నారు. కామారెడ్డిలోని మున్సిపాల్ కార్యాలయం వద్ద కొనసాగుతున్న సమ్మె శిబిరంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ,ఉపాధ్యాయ సంఘం నాయకులు లింగం, వేణుగోపాల్, నళిని దేవి, భగత్, సమగ్ర శిక్ష జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్, రాములు, శ్రీవాణి, శైలజ, మాధవి, సరోజన, కాళిదాస్, లింగం, కవిత, బన్సీలాల్, రాజు, మౌనిక, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.