మోర్తాడ్/నవీపేట, ఆగస్టు 6: జిల్లాలోని ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో వానకాలం పంటలకు కాకతీయ, లక్ష్మీ, సరస్వతీ కాలువలకు గురువారం నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్ట ఎస్ఈ శ్రీనివాసరావు గుప్తా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాలువలతోపాటు అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల ద్వారా నీటిని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. నవీపేట మండలంలోని కోస్లీ గోదావరి నది వద్ద అలీసాగర్ లిప్టు ద్వారా గురువారం నీటి విడుదల చేయనున్నుట్ల అలీసాగర్ ప్రాజెక్టు ఏఈ ప్రణయ్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రాజెక్టులోకి 793 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
ఎస్సారెస్పీలోకి బుధవారం 793 క్యూసెక్కు ల నీరు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు (80.5 టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 1078. 30అడుగుల (40.582 టీఎంసీలు)నీటి నిల్వ ఉన్నది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువకు వంద, మిషన్‌భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 462 క్యూసెక్కుల నీరు ఆవిరిరూపంలో వెళ్తున్నది.
పోచారం ప్రాజెక్టు నీటి విడుదల
నాగిరెడ్డిపేట, ఆగస్టు6: వానకాలం పంటల సాగు కోసం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువ నుంచి బుధవారం నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 1.244 టీఎంసీలు (ప్రధాన కాలువ గేట్ల వద్ద 17 అడుగుల నీరు) ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రధాన కాలువ ద్వారా 150 క్యూసెక్కుల వరద ఆయకట్టుకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1.82టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1.24 టీఎంసీల నిల్వ ఉందన్నారు. కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.