మోర్తాడ్, ఆగస్టు 4: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు పరిధిలో వానకాలం పంటల సాగుకోసం ఈనెల 7న నీటిని విడుదల చేయనున్నట్లు ఎస్ఈ శ్రీనివాసరావు గుప్తా తెలిపారు. వానకాలం పంటలకు సాగునీరందించే ప్రణాళికపై తెలంగాణ నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సమీకృత నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ సమావేశ నిర్ణయం మేరకు కాకతీయ, సరస్వతీ, లక్ష్మీ కాలువలకు నీటి విడుదల ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ నుంచి ఆదివారం 21,422 క్యూసెక్కుల వరద వచ్చిచేరుతున్నది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు(80.5టీఎంసీలు) కాగా, ఆదివారం ప్రాజెక్ట్‌లో 1079.7అడుగులు(44.266టీఎంసీల)నీటి నిల్వ ఉన్నది. ప్రాజెక్ట్ నుంచి 723 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతున్నది. సరస్వతీ కాలువకు 10క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 482 క్యూసెక్కుల నీరు ఆవిరవుతున్నట్లు అధికారులు తెలిపారు.