కామారెడ్డి, మే 20 : రానున్న వానకాలంలో ఇబ్బందులు కలుగకుండా చేపట్టాల్సిన చర్యలపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందుకోసం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా పట్టణంలోని మురికి కాలువలు, నాలాల్లో పూడికతీత పనులు ఈపాటికే ప్రారంభమయ్యాయి. ప్రతి వార్డులో పూడిక తీత పనులు పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులు కార్మికులను ఆదేశించారు. పట్టణంలో శిథిలావస్థలో ఉన్న భవనాలకు ముందస్తుగా నోటీసులు అందజేస్తున్నారు. వానకాలంలో ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో జరిగిన ప్రమాదాల దృష్ట్యా అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సి చర్యలపై శ్రద్ధ చూపుతున్నారు. వార్డుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి క్లీన్ టౌన్‌గా మార్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
27 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు
పట్టణంలోని 49 వార్డుల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు ఈ నెల 27వ తేదీ వరకు పూర్తి చేయాలని మున్సిపల్ సిబ్బందిని అధికారులు ఆదేశించారు. పట్టణంతోపాటు మున్సిపల్ పరిధిలోని ఏడు గ్రామాల్లోనూ పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రారంభించారు. వార్డుల్లో పేరుకుపోయిన చెత్త, ఖాళీ స్థలాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తున్నారు. మురికి కాలువలను శుభ్రం చేసే పనిలో మున్సిపల్ సిబ్బంది నిమగ్నమయ్యారు. వంద శాతం ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించాలని అధికారులు సూచించారు. రోడ్లపై ఉన్న అన్ని శిథిలాలు, పొదలను తొలగిస్తున్నారు. వాణిజ్య ప్రాంతాల నుంచి వ్యర్థాల సేకరణ, పబ్లిక్, కమ్యూనిటీ టాయిలెట్లకు మరమ్మతులు చేయనున్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అపార్ట్మెంట్లలోకి నీళ్లు చేరినప్పుడు సెల్లార్లో ఉండే విద్యుత్ మీటర్ల వద్ద ఎలాంటి ప్రమాదం జరగకుండా మొదటి అంతస్తులోకి మార్చేలా యజమానులకు అవగాహన కల్పిస్తున్నారు.
335 మంది కార్మికులతో పనులు..
ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ కోసం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 49 వార్డుల్లో మొత్తం 335 కార్మికులు పనిచేస్తున్నారు. ఇందులో 56 మంది ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. పట్టణంలో ఏర్పాటుచేసిన పాయింట్ల వద్ద ఆటోల ద్వారా చెత్తను సేకరించే వారు 36 మంది, వార్డుకు ముగ్గురు చొప్పున 147 మంది రోడ్లను శుభ్రం చేస్తున్నారు. ఇలా ప్రతి వార్డులో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తూ స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్ద డంపై మున్సిపల్ అధికారులు దృష్టి సారిస్తున్నారు.
రానున్న వర్షాకాలం దృష్ట్యా ప్రత్యేక చర్యలు
రానున్న వర్షాకాలం దృష్ట్యా పట్టణంలోని వార్డుల్లో పేరుకుపోయిన చెత్తను, మురికి కాలువలను శుభ్రం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఈ నెల 27 వ తేదీ వరకు ప్రత్యేక పారిశుద్ధ్య పనులను పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాం.
– దేవేందర్, కామారెడ్డి మున్సిపల్ కమిషనర్