Kotagiri | కోటగిరి, జూలై 19 : వానకాలం ప్రారంభమై నెల 15 రోజులు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వల్ల బాగా కురవాలని మూడు రోజుల పాటు కోటగిరి శ్రీ ముక్తేశ్వర శివాలయంలో ప్రత్యేకంగా అభిషేకాలు, జలాభిషేకం నిర్వహించారు. కోటగిరి మండల కేంద్రంలోని బ్రాహ్మణగల్లిలోని ఈ ఆలయంలో చివరి రోజు గ్రామస్తుల సహకారంతో భక్తులు, మహిళా భక్తులు శివాలయంలో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి అన్నదానం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజేశ్వర్ జోషి, శివాలయం ప్రధాన అర్చకుడు దత్తాత్రి కులకర్ణి మాట్లాడుతూ వానలు సమృద్ధిగా కురవాలని మూడు రోజుల పాటు కోటగిరి శ్రీ ముక్తేశ్వర శివాలయంలో ప్రత్యేకంగా అభిషేకాలు, జలాభిషేకం నిర్వహించినట్లు చెప్పారు. చివరి రోజు ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి అన్నదానం చేపట్టినట్లు తెలిపారు. చెరువులు నీరు లేక వెల వెల బోతున్నాయని, బోర్లలో నీరు తగ్గడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని, ముఖ్యంగా ఏ ప్రాణికైనా నీళ్లే ఆధారమని, కాబట్టి వర్షాలు బాగా కురవాలని పంటలు పండాలని దేవుడిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరి జ్యోషితో పాటు శివాలయం ప్రధాన అర్చకులు దత్తాత్రేయ కులకర్ణి, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనిల్ కులకర్ణి, సిద్దూ, నూకల రమేష్, బీర్కూర్ శ్యామ్ కుమార్, వడ్ల గంగారం తదితరులు పాల్గొన్నారు.