బాన్సువాడ / బాన్సువాడ టౌన్ / సెప్టెంబర్ 24:దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కార్పొరేట్ స్థాయిలో విద్య, వైద్యం అందుతున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ, బీర్కూర్‌లో పలు అభివృద్ధి పనులను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడంతో కర్ణాటకలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజలను మోసం చేయడం తగదన్నారు. మనం శాశ్వతం కాదని.. మనం చేసే మంచి పనులే ఎల్లకాలం గుర్తుండిపోతాయన్నారు. పేద విద్యార్థులకు గొప్ప భవిష్యత్తు ఇవ్వడానికే సీఎం కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేశారని చెప్పారు. సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తున్నదన్నారు.
దేశంలో పేదలకు విద్య, వైద్యాన్ని కార్పొరేట్ తరహాలో అందిస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే అని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.59 లక్షల తో నిర్మించిన మండల పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రహరీ, అదనపు తరగతి గదులను ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని సొసైటీ భవనం, ఎస్టీ, మైనార్టీ ఫంక్షన్‌హాళ్ల వద్ద అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నేలపై కూర్చొని చిన్నారులతో ముచ్చటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ మాట్లాడారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇచ్చిన హామీలను అమలుచేయలేకపోవడంతో రాష్ట్రంలో అల్లకల్లోలమవుతుందని తెలిపారు. మహారాష్ట్రలో రైతులు పండించిన ధాన్యం అక్కడి ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో మన రాష్ట్రంలో అమ్ముకోవాలని చూస్తున్నారని తెలిపారు. ఆ రాష్ర్టాల్లో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీలకు ప్రజలకు న్యాయం చేయడం చేత కావడంలేదన్నారు.
తెలంగాణలో రైతాంగానికి రెండు పంటలకు సాగునీరు అందించడంతోపాటు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని నడపడమంటే రాజకీయ లబ్ధి కోసం నమ్మిన ప్రజలను మోసం చేయడం కాదన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేసేవారిని వారి విధేయతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. నాయకులు, అధికారులు మారవచ్చు కానీ మనం భావితరాల కోసం చేసిన ప్రతి మంచి పని చిరకాలం ఉంటుందన్నారు. పేద విద్యార్థులకు గొప్ప భవిష్యత్తు ఇవ్వడానికే సీఎం కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేశారని చెప్పారు. కార్పొరేట్ విద్యను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. మంచి మనస్సు, దృఢ సంకల్పంతో చేసే పనులకు దేవుడు, ప్రకృతి కూడా సహకరిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజక వర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. పేద ప్రజలకు న్యాయం చేయడంలో ఆనందం ఉందన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రమాకుమారి, రాం బాబు, ఎంపీపీ రఘు, జడ్పీటీసీ స్వరూపా శ్రీనివాస్ , మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, కమ్మ సత్యనారాయణ, తిమ్మాపూర్ రాంబాబు, అప్పారావ్ , హన్మంత్ రావ్, నర్సరాజు, విఠల్ తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడలో అభివృద్ధి కార్యక్రమాల్లో పోచారం
అంతకుముందు సభాపతి బాన్సువాడ పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీలో రూ. 25 లక్షలతో చేపట్టనున్న కొత్త బాన్సువాడ ముదిరాజ్ సంఘ భవన నిర్మాణ పనులకు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు అనంతరం ముదిరాజ్‌లు పీఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన కృతజ్ఞత, ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి అదనంగా మరో రూ.50 లక్షలు మంజూరుచేస్తున్నట్లు ప్రకటించారు. బాన్సువాడ పట్టణంలో రూ.52 లక్షలతో నిర్మించిన సీఎస్ఎస్ చర్చిని సభాపతి పోచారం ప్రారంభించారు.