కామారెడ్డి, మే 24 : కామారెడ్డి జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా క్రీడలు, యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడల ముగింపు సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు 191 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు తెలిపారు.
గ్రామీణ క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ క్రీడాకారులు మండల స్థాయిలో ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయికి ఎంపికయ్యారని చెప్పారు. సీఎం కేసీఆర్ గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి స్థానిక క్రీడాకారులకు శిక్షణ పొందే వీలు కల్పించారని తెలిపారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. జిల్లా క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో రాణించి ప్రథమ బహుమతులు సాధించి తల్లిదండ్రులు, జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ.. ఈ నెల 15 నుంచి 17 వరకు మం డల స్థాయి, 22 నుంచి 24 వరకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.
రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇ వ్వాలని అధికారులకు సూచించారు. అనంతరం జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబర్చిన జట్లకు స్పీకర్ పోచారం, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్పర్సన్ ఇందూప్రియ, జడ్పీ వైస్‌చైర్మన్ ప్రేమ్ కుమార్, డీఈవో రాజు, జడ్పీ సీఈవో సాయాగౌడ్, ఎస్జీఎఫ్ కార్యదర్శి రసూల్, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.