బాన్సువాడ, జనవరి 10 : రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నది. నాటి ఆంధ్రపాలకులు తెలంగాణ ప్రాంతంలో విద్యకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కానీ తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. దీనికి తోడు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి చదువు విలువ అంటే ఎంటో తెలుసు ‘డబ్బు కొందరిది.. విద్య అందరిదీ’ అనే నినాదంతో తన నియోజకవర్గమైన బాన్సువాడలో పలు పాఠశాలలు, కళాశాలలను మంజూరు చేసి పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.
రాష్ట్రంలో ఎక్కడాలేనన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు, బాలుర, బాలికల కళాశాలలు, వృత్తి విద్యా, ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ డిప్లమా కోర్సు కళాశాలలు ఏర్పాటు చేశారు. తాజాగా బీసీ, ఎస్సీ పోస్ట్‌మెట్రిక్ బాలికల వసతి గృహాలకు రూ.6 కోట్లు మంజూరు చేశారు. ఇక్కడ కార్పొరేట్‌కు దీటుగా నాణ్యమైన విద్య అందుతుండడంతో ఇతర ప్రాంత విద్యార్థులు సైతం ఇక్కడికే వస్తుంటారు.స్పీకర్ కుమారుడు, ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి తన సొంత ఖర్చుతో బాన్సువాడ, రుద్రూర్ ప్రాంతాల్లో పీబీఆర్ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రభుత్వ కొలువు సాధించేలా పేద విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు.
స్పీకర్ పోచారం ప్రత్యేక కృషి..
సమైక్య పాలన నుంచి నేటి వరకు ఎమ్మెల్యే, మంత్రి, స్పీకర్ హోదాల్లో ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి తన నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. తానే స్వయంగా వెళ్లి తన ప్రాంతంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేసేలా నిధులు, కళాశాలలను మంజూరు చేయిస్తారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన వ్యక్తిగా ఉండడంతో బాన్సువాడలో అన్ని రకాల విద్యాలయాలను స్పీకర్ నెలకొల్పారు. దేశంలో అత్యంత తక్కువగా ఉన్న ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కళాశాలను తాను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే రుద్రూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని కళాశాల రుద్రూర్లో నెలకొల్పి ఎంతో మందికి విద్యను అందిస్తుండడంతో కొందరు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడారు.
బాన్సువాడ నియోజక వర్గంలోని కళాశాలలు..
బాన్సువాడ మండలంలో..ఆదర్శ పాఠశాల (కొత్తాబాది), కేజీబీవీ (కొత్తాబాది), సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల (కొయ్యగుట్ట), సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల (బోర్లం క్యాంపు), మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల (బాన్సువాడ), ప్రభుత్వ బాల, బాలికల ఇంటర్ జూనియర్ కళాశాల (బాన్సువాడ), ప్రభుత్వ ఉర్దూ ఇంటర్ కళాశాల (బాన్సువాడ), ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల (బాన్సువాడ), శ్రీ రాంనారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాల (బాన్సువాడ), ప్రభుత్వ ఉర్దూ డిగ్రీ కళాశాల (బాన్సువాడ), ప్రభుత్వ పీజీ కళాశాల (బాన్సువాడ), బీఎస్సీ నర్సింగ్ కళాశాల (బాన్సువాడ). బీర్కూర్ మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాల (బీర్కూర్), కేజీబీవీ (బీర్కూర్). గిరిజన రెసిడెన్షియల్ పాఠశాల (నస్రుల్లాబాద్). కోటగిరి మండలంలో.. ప్రభుత్వ ఇంటర్ కళాశాల, ప్రభుత్వ ఇంటర్ ఉర్దూ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల, కేజీబీవీ. రుద్రూర్ మండలంలో.. ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కళాశాల, అగ్రి కల్చరల్ డిప్లమా కోర్సు కళాశాల, కేజీబీవీ. వర్ని మండలంలో.. ప్రభుత్వ జూనియర్ కళాశాల, కేజీబీవీ.
యువతకు మంచి చేయాలన్నదే నా సంకల్పం
రూ. లక్షలు ఖర్చు పెట్టి దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాలంటే చాలా మంది పేద విద్యార్థులు చదువును మధ్యలో ఆపేసే పరిస్థితి ఉంటుంది. బాన్సువాడ ప్రాంతంలో చదువుకునే వారికి పాఠశాల నుంచి డిగ్రీ, పీజీ కళాశాలలు, ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కళాశాల, అగ్రికల్చరల్ డిప్లమా, పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయించాను. కుటుంబంలో ఒక్కరు బాగా చదువుకొని ప్రయోజకుడు అయితే కుటుంబం బాగుంటుందనేది నా అభిప్రాయం. ముఖ్యంగా ఆడపిల్లల కోసం బాన్సువాడలో మొదట గురుకుల పాఠశాలలు, వసతి గృహాలను ఏర్పాటు చేయించా. నియోజకవర్గ యువతకు మంచి చేయాలన్నదే నా సంకల్పం.
–స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
నిరుద్యోగ యువత కోసమే ‘పీబీఆర్’ ఏర్పాటు
పేద విద్యార్థులు కానిస్టేబుల్, ఎస్సై, గ్రూప్ ఉద్యోగ పరీక్షలకు సిద్ధం కావాలంటే కోచింగ్ అవసరం. వారు కోచింగ్‌కు వెళ్లే పరిస్థితి ఉండదు. నిరుపేద యువత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా తగు చర్యలు తీసుకోవాలన్న నా తండ్రి పోచారం శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు సొంత ఖర్చుతో బాన్సువాడ, రుద్రూర్లో పీబీఆర్ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేశా. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో చాలా మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు సాధించారు.
– డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి
స్పీకర్ పోచారం కృషి మరువలేనిది
ఎంతో మంది పేదలకు మంచి భవిష్యత్తు ఉండేలా విద్యా రంగానికి స్పీకర్ పోచారం ఎనలేని కృషి చేస్తున్నారు. పోచారం ప్రత్యేక శ్రద్ధతోనే నియోజకవర్గంలో అనేక కళాశాలలు ఏర్పడ్డాయి. విద్యాభివృద్ధికి పోచారం, డీసీసీబీ చైర్మన్ ఎంత కృషి చేస్తున్నారు. కళాశాలలో చదివినవారమంతా ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డాం. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న.
– దాసరి రవి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, బాన్సువాడ
విద్యారంగానికి స్పీకర్ కృషి
స్పీకర్ పోచారం విద్యారంగానికి విశేష కృషి చేస్తున్నారు. నేను స్పీకర్ పోచారం కృషితో ఏర్పాటైన శ్రీరాంనారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే చదివాను. కళాశాలలో చదివినవారమంతా ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డాం. ప్రస్తుతం నేను రాష్ట్ర విజిలెన్స్ విభాగంలో సీఐగా విధులు నిర్వహిస్తున్నా.
– అభినవ్ చతుర్వేది, సీఐ, రాష్ట్ర విజిలెన్స్ విభాగం