బిచ్కుంద, డిసెంబర్ 15 : సోయా రైతులు రోడ్డెక్కారు. ఐదు రోజుల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రంలో సోయా పంటను కొనుగోలు చేసి, ఐదు రోజుల తర్వా త నాణ్యత లేదంటూ పంటను తిరిగి పంపించారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఆదివారం రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. బిచ్కుంద మండలం గోపన్పల్లి గ్రామానికి చెందిన 20 మంది రైతులు ఈ నెల 10న బిచ్కుంద రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో సోయా పంటను విక్రయించారు. రైతులు విక్రయించిన 1200 బస్తాల సోయా పంటను (మూడు లోడ్ లారీలు) నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్) అధికారులు ఆదివారం తిరిగి పంపించారు. దీంతో రైతులు సొసైటీ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. కొనుగోలు సమయంలో నాణ్యతా ప్రమాణలు పాటించి అమ్మి తే ఐదురోజుల తర్వాత నాణ్యత లేదని తిరిగి పంపడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సొసై టీ అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడి, న్యాయం చేస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.