మాక్లూర్ జూన్ 8: తండ్రి మందలించడంతో కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. నిర్మల్ జిల్లా నర్సాపురం గ్రామానికి చెందిన సిందే శివకుమార్ (17) నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సెకండ్ సెమిస్టర్లో రెండు సబ్జెక్టులు, థర్డ్ సెమిస్టర్లో రెండు సబ్జెక్టులు, ఫోర్త్ సెమిస్టర్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ కాగా.. శ్రద్ధగా చదువుకోవాలని తండ్రి మందలించాడు.
సప్లిమెంటరీ పరీక్షలు రాయడానికి శివకుమార్ వారం రోజుల క్రితం జిల్లా కేంద్రానికి వచ్చాడు. ఈ నెల 6వ తేదీన మధ్యాహ్నం హాస్టల్ నుంచి దాస్నగర్ గ్రామశివారులోకి వెళ్లి గడ్డి మందు తాగాడు. అక్కడి నుంచి తిరిగి హాస్టల్కు వెళ్లి వాంతులు చేసుకోవడంతో గమనించిన స్నేహితులు వెంటనే దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.