ఎల్లారెడ్డి రూరల్, సెప్టెంబర్ 6: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల కళాశాలలో గురువారం రాత్రి తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. రెండు వర్గాలుగా విడిపోయిన విద్యార్థులు ఇనుప పైపులు, క్రికెట్ బ్యాట్లతో కొట్టుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిసింది. విద్యార్థుల ఘర్షణపై సమాచారం అందుకున్న ఆర్డీవో ప్రభాకర్ శుక్రవారం కళాశాలకు వచ్చి ఏం జరిగిందో తెలుసుకున్నారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. గురుకుల కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న ఓ విద్యార్థి చెడు వ్యసనాలకు లోనయ్యాడు.
తన మిత్ర బృందంతో కలిసి అధ్యాపకుల కండ్లు గప్పి కళాశాల ఆవరణలోనే బీరు, సిగరేట్ తాగడం వంటివి చేసేవాడు. ఇది గమనించిన తోటి విద్యార్థి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయగా, పట్టించుకోలేదు. మూడు రోజుల క్రితం మరోసారి బీర్లు, సిగరెట్లు తాగగా ఆ విద్యార్థి రెండోసారి ప్రిన్సిపాల్ నాగేశ్వరరావుకు ఫిర్యాదు చేయగా, ఆయన సదరు విద్యార్థులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే, ఫిర్యాదు చేసిన విద్యార్థిపై ఆగ్రహం పెంచుకున్న సదరు బ్యాచ్ సమయం కోసం వేచిచూసింది. హిందీ అధ్యాపకుడు పండిత్ గురువారం రాత్రి గంట సేపు మాత్రమే డ్యూటీలో ఉండి ఇంటికి వెళ్లిపోయాడు.
ఇదే అదనుగా సదరు విద్యార్థుల బృందం అర్ధరాత్రి 12 గంటల సమయంలో హాస్టల్లోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, ఇనుపు పైపులు, క్రికెట్ బ్యాట్లతో దాడికి దిగింది. ఈ క్రమంలో రెండు వర్గాలుగా విడిపోయిన విద్యార్థులు కళాశాలలో వీరంగం సృష్టించారు. అక్కడే ఉన్న మరికొంత మంది హుటాహుటిన ప్రిన్సిపాల్ వద్దకు వెళ్లి విషయం చెప్పగా, ఆయన వచ్చి సర్దిచెప్పారు. దాడిలో గాయపడిన వారిని ఎల్లారెడ్డి దవాఖానకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. ఈ వ్యవహారంపై ఆర్డీవో ప్రభాకర్, తహసీల్దార్ మహేందర్, సీఐ రవీందర్‌నాయక్, జోనల్ అధికారి ఫ్లోరెన్స్ రాణి కళాశాలకు చేరుకొని విచారణ చేపట్టారు. విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, తప్పు ఎవరు చేసినా కఠినంగా చర్యలు తీసుకుంటామని ఆర్డీవో తెలిపారు.