నిజాంసాగర్, డిసెంబర్ 8: నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట ఎస్సీ గురుకుల కళాశాలలో అజయ్ అనే ఇంటర్ విద్యార్థి ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థి మృతిపై గురుకుల కళాశాలను జోనల్ అధికారిణి ప్రత్యూష, డీసీవో శివరాం వేర్వేరుగా సందర్శించి విచారణ చేపట్టారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. అజయ్ వెంట ప్రాజెక్టుకు వెళ్లిన నలుగురు మిత్రులతో విడివిడిగా మాట్లాడి వివరాలు సేకరించారు.
సాయంత్రం డీసీవో గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి ఉపాద్యాయుల తీరు, విద్యార్థుల పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గురుకుల సోషల్ వెల్ఫేర్ సొసైటీ సెక్రెటరీ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు ఇన్చార్జి వైస్ ప్రిన్సిపాల్‌కు గణపతికి షోకాజ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఆంగ్ల ఉపాధ్యాయుడు రవికాంత్‌ను సస్పెండ్ చేయడంతోపాటు ఔట్‌సోర్సింగ్‌గా విధులు నిర్వహిస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు లక్ష్యయ్య, పీఈటీ రాజు, వాచ్‌మన్ కిషన్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఘటనపై త్వరలో పూర్తి విచారణ అధికారులను నియమించనున్నట్లు వారు తెలిపారు