వినాయక్ నగర్, అక్టోబర్ 11: నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలోని ప్రధాన వ్యాపార సముదాయాలు ఉన్న దేవీ రోడ్డు ప్రాంతంలో దుకాణాలు మూతపడ్డాయి. వన్‌వేతో తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయంటూ వ్యాపారస్తులు షాపులు బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే వన్‌వేను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని దేవీ రోడ్డు ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు గత నెల రోజులుగా వన్ వే రూట్‌ను అమలు చేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారాలు నడవడంలేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. వన్ వే రూట్‌ను ఎత్తివేయాలని తమ షాపులను బంద్ చేసి రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు.
విషయం తెలుసుకున్న ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి.. ఏదైనా ఉంటే సంబంధిత అధికారులకు వినతి పత్రం అందజేయాలని వ్యాపారస్తులకు సూచించారు. దీంతో అంతా కలిసి నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ అందుబాటులో లేకపోవడంతో పోలీస్ అధికారికి అందజేశారు. అనంతరం దేవి రోడ్ లోని వన్ వేను తొలగించి తమ వ్యాపారాలు నడిచేందుకు సహకరించాలని కోరుతూ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు వినతిపత్రం అందించారు.