కామారెడ్డి, జనవరి 7 : 67వ జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్- 2024 అండర్ 17 కబడ్డీ పోటీలు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ భారతదేశ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని.. గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు కామారెడ్డిలో మొట్టమొదటిసారిగా నిర్వహించినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు.
వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, కోచ్‌లు పోటీలను విజయవంతం చేయాలన్నారు. క్రీడాకారులకు కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తామన్నారు. క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ నెల 11వ తేదీ వరకు పోటీలు కొనసాగుతాయి. 29 రాష్ర్టాలకు చెందిన 450 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో రాజు, జిల్లా యువజన క్రీడల అధికారి దామోదర్ రెడ్డి, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి నాయబ్ రసూల్, ఎస్జీఎఫ్ కార్యదర్శి రాంరెడ్డి, దాతలు పైడి ఎల్లారెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.