నిజామాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కుంభవృష్టి, అతి భారీ వానలతో కామారెడ్డి జిల్లా తీవ్రంగా దెబ్బతింది. ఇందులో రైతులు కోలుకోలేని విధంగా పంట నష్టానికి గురయ్యారు. వానాకాలంలో పంటలు సమృద్ధిగా పండించి లాభాలు ఆర్జించాలని ఆశలు పెట్టుకున్న అన్నదాతలకు వరద రూపంలో పిడుగు పడినట్లుగా మారింది. వరద నీటిలో వరి పైరు మునగడం, ఇసుక పేరుకుపోవడం, వరదకు వరి పంట కొట్టుకు పోవడంతో పంట పొలాలు చాలా చోట్ల నామరూపాల్లేకుండా పోయింది.
ముఖ్యమంత్రి మాట ప్రకారం పంట నష్టానికి పరిహారం వస్తే కాసింత ఉపశమనం దక్కు తుం దని చాలా మంది రైతన్నలు ఎదురు చూస్తు న్నారు. కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 4న పర్యటించారు. ఈ సందర్భంగా రైతులను ఆదుకుంటామని ప్రకటన చేసినప్పటికీ చిల్లి గవ్వ రైతులకు అందలేదు. తుది నివేదిక తయారీకి ఆదేశాలు ఇచ్చి వెనుదిరిగారు. పక్షం రోజుల్లో హైదరాబాద్లో సమీక్ష నిర్వహిస్తానని చెప్పి చేతులు దలుపుకున్నారు. పంట నష్టం పరిహారం అందాలంటే 33 శాతం పంట నష్టం వాటిల్లాలి. అప్పుడే పరిహారం మంజూరు అవుతోంది. ఈ నిబంధన మూలంగా కామారెడ్డి జిల్లాలో చాలా మందికి సాయం అందడం అనుమానంగానే ఉంది.
కామారెడ్డి జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో మొత్తం 5లక్షల 20వేల ఎకరాల్లో పంటలు సాగుకు నోచుకున్నాయి. అతి భారీ వానల మూలంగా జిల్లాలో 334 గ్రామాల్లో 37వేల 313 మంది రైతులకు సంబంధించిన 50,028 ఎకరాల్లో పంట పొలాలు వరద ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ అధికారికంగా ప్రకటించింది. తుది అంచనా వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. సీఎం ఆదేశాలతో నష్ట అంచనాలు సేకరిస్తుండటంతో మరింత పెరిగే ఆస్కారం ఉంది.
ఉద్యాన పంటలు 140 – 200 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. సుమారుగా 3వేల ఎకరాలకు పైగా పంట పొలాల్లోకి ఇసుక కొట్టుకు రావడంతో సాగుకు యోగ్యంగా లేకుండా పోయింది. అనధికారిక సమాచారం ప్రకారం 3.20లక్షల ఎకరాల్లో వరి పంటలు సాగవ్వగా 25వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగి డ్యామేజ్ అయ్యింది. ఇందులో ఇసుక పేరుకుపోవడంతోనే ఎక్కువ నష్టం వాటిల్లింది. సోయా పంట 84,220 ఎకరాల్లో సాగవ్వగా జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో 18వేల ఎకరాల వరకు వరద ధాటికి తీవ్ర ప్రభావానికి లోనైంది. అడుగున్నర ఎత్తుకు ఎదిగిన సోయా మొక్కలు 2-3 అడుగుల ఎత్తుతో ప్రవహించిన వరదకు చాలా చోట్ల నామ రూపాల్లేకుండా పోయింది.
మొక్కజొన్న, పత్తి పంటలు సైతం ఐదారు వేల ఎకరాల్లో రైతులను తీవ్రంగా దెబ్బ తీశాయి. ఊహాకు అందని రీతిలో వరద రావడంతో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సుమారుగా లక్ష ఎకరాలు దెబ్బతీసినట్లుగా తెలుస్తోంది. పంట నష్టం వాటిల్లిన రైతులకు ఎకరానికి రూ.50వేలు నుంచి రూ.25వేలు వరకు సాయం ప్రకటించాలన్న డిమాండ్ రైతుల నుంచి గట్టిగా వస్తోంది. ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎకరా పంట నష్టానికి ఎంత మొత్తంలో పరిహారం అందిస్తారు? అన్నది స్పష్టత ఇవ్వలేదు.