బాల్కొండ, జనవరి 7: గంజాయి తాగుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్సై గోపి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో వెల్లడించారు. మండల కేంద్రంలోని ఆర్మూర్ గల్లీ లో ఏడుగురు గంజాయి తాగుతున్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు మేజర్లు కాగా.. ఐదుగురు మైనర్లు ఉన్నారు. వారిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు.
పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, స్నేహం ముసుగులో రాత్రి వరకు బయట తిరుగుతూ నిషేధిత ప్రమాదకర గంజాయి తాగుతున్నారని తెలిపారు. గంజాయి సేవించినట్లు తెలిస్తే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కేసులో తమకు సహకరించిన తహసీల్దార్ వినోద్, గిర్దావర్ రవీందర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఏఎస్సై రాజేశ్వర్, పోలీసు సిబ్బంది సతీశ్, లింగన్న, ప్రశాంత్, మల్లేశ్, పవన్, నరేశ్‌ను ఎస్సై గోపి అభినందించారు.