నిజామాబాద్ ఆబ్కారీ శాఖ అప్రతిష్ట మూటగట్టుకుంటున్నది. అవినీతి ఆరోపణలు, నిత్యం వివాదాలతో ఆ శాఖ పరువు బజారున పడుతున్నది. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకోవడం గమనార్హం. తీవ్ర అవినీతి ఆరోపణలు, అక్రమ వ్యవహారాలు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరు ఎక్సైజ్ శాఖను అపహాస్యం చేస్తున్నాయి.
ఉద్యోగోన్నతులు, బదిలీల పేరిట ఎవరు వచ్చినా పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించడంలేదు. కొన్నాళ్లుగా జిల్లాలో వెలుగు చూస్తున్న ఉదంతాలు రాష్ట్రస్థాయిలోనూ చర్చనీయాంశంగా మారాయి. ఎక్సైజ్ శాఖలో కింది స్థాయిలో పనిచేస్తున్న కానిస్టేబుల్ మొదలు ఎస్‌హెచ్‌వోలు, సీఐ, ఈఎస్ స్థాయి వరకు అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత ఎక్సైజ్ శాఖ మరింత దిగజారింది. పట్టించుకునే వారే కరువవడంతో ఆబ్కారీ అధికారులకు ఆడిందే ఆట… పాడిందే పాటగా మారింది. మామూ ళ్ల మత్తులో ఊగుతూ తూగుతూ, తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అవినీతికి పాల్పడిన వారిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నా.. అధికారుల్లో కనీస స్పందన కానరాకపోవడం విస్తు గొల్పుతున్నది. ఎక్సైజ్ శాఖలోని కొంత మంది స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, సీఐలు మద్యం విక్రయాలతోపాటు మామూళ్ల వసూళ్లలోనూ టార్గెట్లను పెట్టుకుని, పని చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మరో అధికారి అవినీతి ఆరోపణలపై విచారణ చేపడుతున్నారంటూ ఆబ్కారీ సిబ్బందే కోడై కూస్తుండడం గమనార్హం.
రేవంత్ రెడ్డి సర్కారు ఆబ్కారీ శాఖకు కొన్ని లక్ష్యాలను నిర్దేశించింది.ఇందులో ప్రధానంగా బెల్టు షా పుల నియంత్రణ, గంజాయి రవాణా కట్టడి ముఖ్యమైనవి. ఇవేవి పట్టించుకోకుండా నిత్య సంఘర్షణలతో ఆబ్కారీ అధికారులు, సిబ్బంది పాకులాడుతుండడం విడ్డూరంగా మారింది. ఎక్సైజ్‌లో అక్రమాలను అరికట్టేందుకు పని చేసే ఎన్ఫోర్స్మెంట్ విభాగమైతే చుట్టపు చూపునకే పరిమితమైంది.
గత ప్రభుత్వంలో ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిరంతరం దాడులు నిర్వహించేది. మఫ్టీలో మద్యం దుకాణాల్లో సాధారణ వ్యక్తుల్లా వెళ్లి తనిఖీలు చేపట్టేది. దీంతో అధిక ధరల నియంత్రణ జరిగింది. కల్తీ మద్యం వంటిది కానరాకుండా పోయింది. ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ చర్యలేవీ కానరాకపోవడంతో అనేక అక్రమాలు చాప కింద నీరులా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అక్రమార్కులతో అంటకాగడంవల్లే తనిఖీలు చేపట్టడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఉమ్మడి జిల్లా పరిపాలనను గాలికి వదిలేసిన జూపల్లి కృష్ణారావు ఇటువైపు కన్నెత్తి కూడా చూడడంలేదు. ఆబ్కారీ శాఖలో గతం లో ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. సస్పెన్షన్ వేటు పడినప్పటికీ శాఖ పరువు మంట గలిసింది. నిజామాబాద్ పట్టణ ఎక్సైజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్పైనా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అదే స్థాయిలో లైంగిక వేధింపులు వెలుగు చూడగా సదరు అధికారి మూ లంగా పరువు బజారున పడింది.
ప్రస్తుతం మూడో కల్లు డిపో వ్యవహారం ఆబ్కారీ శాఖ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. కాంగ్రెస్ నేతలే పాత్రధారులుగా రాజ్యమేలుతున్న ఈ వ్యవహారంలో అడ్డదిడ్డంగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు రోజుకో విధంగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఫిర్యాదుల పరంపర రకరకాలుగా వస్తున్నప్పటికీ ఆబ్కారీ శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మొన్నటికి మొన్న బోధన్‌లోనూ ఎక్సైజ్ సీఐ చేసిన అవినీతి అరాచకంపై ప్రభుత్వ పెద్దలే ఆశ్చర్యానికి గురై వేటు వేశారు. తాజాగా నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌పై అవినీతి ఆరోపణలు గుప్పుమన గా, విచారణ కొనసాగుతున్నది.