ఖలీల్‌వాడి, ఆగస్టు 25 : ర్యాగింగ్‌ను మొగ్గదశలోనే తుంచివేయాలని సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్‌రావు అన్నారు. చక్కగా చదువుతూ భవిష్యత్తును బంగారుమయంగా మార్చుకోవాలని సూచించారు. సోమవారం ఆయన నిజామాబాద్ వైద్యకళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ర్యాగింగ్ అనేది విష సంస్కృతి అని, దానిని మొగ్గదశలోనే అణిచివేయాల్సిన అవసరం ఉందన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థులను సస్పెండ్ చేయడమే కాకుండా కళాశాల నుంచి పంపిస్తారని తెలిపారు. తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే వారి కష్టానికి ఇచ్చే ఫలితం ఇలానే ఉంటుందా అని ప్రశ్నించారు. శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జలగం తిరుపతి రావు, డాక్టర్ రాములు తదితరులు పాల్గొన్నారు.
ఐదుగురు మెడికోలపై సస్పెన్షన్ వేటు
నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు హౌస్ సర్జన్లపై వేటు పడింది. ఆరు నెలలు సస్పెండ్ చేయడంతో పాటు హాస్టల్ నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణమోహన్ తెలిపారు. అడిషనల్ కలెక్టర్ అంకిత్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ జలగం తిరుపతిరావు తదితరులతో కూడిన యాంటీ ర్యాగింగ్ కమిటీ సోమవారం సమావేశమై ఇరువర్గాల వాదనలు విని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసుల నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.