వినాయక్‌నగర్, ఫిబ్రవరి 27: మహిళలకు ఆత్మరక్షణ తప్పనిసరి అని, సెల్ఫ్ డిఫెన్స్ ఉన్నవారు ఎక్కడికైనా వెళ్లగరని, ఏదైనా ధైర్యంగా సాధిస్తారని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. నిజామాబాద్ నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో పోలీస్, ఫారెస్ట్, హెల్త్ డిపార్ట్మెంట్లలోని మహిళా సిబ్బందికి ఏర్పాటు చేసిన తైక్వాండో శిక్షణ కార్యక్రమాన్ని జడ్జి సునీత కుంచాల, సీపీ కల్మేశ్వర్ సింగేనవార్ మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కాలేజీ మైదానంలో మార్చి 2వ తేదీన ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం 10వేల మంది మహిళలకు తైక్వాండో శిక్షణను ఇవ్వనున్నామని అన్నారు. మార్చి 2న జరిగే కార్యక్రమా న్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిజామాబాద్ ఏసీపీ ఎల్.రాజావెంకట్ రెడ్డి, ఆర్ఐ రమేశ్, తైక్వాండో కార్యదర్శి కె.మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.