వేసవి సెలవులు ముగిశాయి. నేటి నుంచి బడిగంట మోగనున్నది. ఆటపాటల్లో మునిగితేలిన విద్యార్థులు ఇక బడిబాట పట్టనున్నారు. నాణ్యమైన విద్యతో పాటు ఆటలు, వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తలిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు సౌకర్యాలను కల్పిస్తున్నది. ఇప్పటికే బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు చేపట్టిన ‘బడిబాట’ విజయవంతమైంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ముందుగానే పాఠ్య పుస్తకాలను సిద్ధంగా ఉంచారు. 2023-24 విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్‌ను సైతం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి నో బ్యాగ్ డేను అమలు చేస్తున్నారు. ప్రతి నెలా నాల్గో శనివారం ‘నో బ్యాగ్ డే’గా పాటించనున్నారు. 1 నుంచి 5వ తరగతుల విద్యార్థుల్లో దాగిన ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి వివిధ అంశాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారు. పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యాశాఖ ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాట్లను పూర్తి చేసింది.
కామారెడ్డి/ ఖలీల్‌వాడి, జూన్ 11: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి నేటి(సోమవారం) నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఏప్రిల్ నుంచి వేసవి సెలవుల్లో సరదగా గడిపిన విద్యార్థులు మళ్లీ బడిబాట పట్టనున్నారు. 2023-24 విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్‌ను సైతం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఇప్పటికే పాఠ్యపుస్తకాలు సైతం ఆయా పాఠశాలలకు చేరుకున్నాయి. ఏ పాఠశాలలో చేర్పిస్తే తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందోనని తల్లిదండ్రులు సమాలోచనలు చేస్తున్నారు. నాణ్యమైన విద్యతో పాటు ఆటలు తదితర అంశాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించడంతో సర్కారు బడుల్లోనే తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపుతన్నారు.
ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు..
ప్రైవేటు పాఠశాలలకు తీసిపోని విధంగా ప్రభుత్వ బడుల్లో కావాల్సిన వసతులను ప్రభుత్వం కల్పిస్తున్నది. ‘మన ఊరు మన బడి’లో భాగంగా పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నది. విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీ పరీక్షలను నిర్వహిస్తున్నది. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థులు సర్కారు బడుల వైపు మొగ్గు చూపుతున్నారు. విద్యార్థులు చదువులోనే కాకుండా అన్ని రంగాల్లో రాణించేలా విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది.
ప్రభుత్వ బడుల్లో మెరుగైన వసతులు..
ప్రభుత్వం సర్కారు బడుల్లో మెరుగైన వసతులను కల్పిస్తున్నది. ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫారాలు, వారానికి మూడు గుడ్లతో పౌష్టికాహారం (మధ్యాహ్న భోజనం), ఉచిత నోట్ పుస్తకాలు అందజేస్తున్నది. గాలి, వెలుతురు వచ్చే విధంగా విశాలమైన తరగతి గదులు, మరుగుదొడ్లు, ఉచిత అభ్యసన సామగ్రి, సువిశాలమైన ఆట స్థలం అందుబాటులో ఉన్నాయి. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచుతూ విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తున్నారు. బయోమెట్రిక్ హాజరు, రుచికరమైన మధ్యాహ్న భోజనం, వెనుకబడిన విద్యార్థుల కోసం జ్ఞానాధార కార్యక్రమం. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందుబాటులో ఉంటున్నాయి. ప్రభుత్వ బడుల్లో డిజిటల్ విద్యా విధానం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో బోధన, ఎస్కార్ట్ అలవెన్సు, ఫిజియోథెరపీ సౌకర్యాలను కల్పిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు ఇలా..
నిజామాబాద్ జిల్లాలో అన్ని యాజమాన్యాల ప్రైమరీ స్కూళ్ల సంఖ్య 832. అప్పర్ ప్రైమరీ పాఠశాలలు 342, ఉన్నత పాఠశాలలు 556 ఉన్నాయి. ప్రత్యేక అవసరాల విద్యార్థుల కోసం ఐదు, టీఎస్ ఆర్ఈఐ సొసైటీ స్కూళ్లు ఐదు, కేజీబీవీలు 19 ఉన్నాయి. టీఎస్హెచ్డబ్ల్యూఆర్ఈఐ సొసైటీ స్కూళ్లు 8, టీఎస్టీడబ్ల్యూఆర్ఈఐ సొసైటీ స్కూళ్లు 4, ఆశ్రమ పాఠశాలలు 3, ఒక మినీ గురుకులం, మండల ప్రజా పరిషత్, జిల్లా పరిషత్ హై స్కూళ్లు 1,032, ప్రైవేట్ ఎయిడెడ్ 40, ఎన్సీఎల్పీ 12, ఒక కేంద్రీయ విద్యాల యం, పది మోడల్, ఒక అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్, ఆరు మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ స్కూళ్లు, 16 మైనార్టీ సంక్షేమ స్కూళ్లు ఉన్నాయి. తమ గ్రామంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభిస్తే పిల్లలను ప్రైవేటుకు పంపబోమని పలు గ్రామాల్లో ప్రజలు తీర్మానాలు సైతం చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో మొత్తం 1,257 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 1,57,000 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 1,011 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి.అందులో 697 ప్రాథమిక, 127 ప్రాథమికోన్నత, 187 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది.
ముగిసిన బడిబాట..
ఈనెల 3 నుంచి 9వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. బడి మానేసిన పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేవిధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ‘సర్కార్ బడి.. చదువుల ఒడి’ అని భావించి ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని ఉపాధ్యాయులు నిర్వహించిన బడి బాట ఉమ్మడి జిల్లాలో విజయవంతమైంది. పదో తరగతి విద్యార్థులకు జనవరి 10, 2024 వరకు సిలబస్ పూర్తి చేసి, పునఃశ్చరణ తరగతులను నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఫిబ్రవరి 29, 2024 లోగా సిలబస్‌ను పూర్తి చేయాలని టార్గెట్ విధించింది. ఎఫ్ఏ2 పరీక్షలను మార్చి 2024లోగా నిర్వహించాలని ఆదేశించింది. యోగా, మెడిటేషన్ తరగతులను నిర్వహించాలని, విద్యార్థుల హాజరు 90 శాతానికి తగ్గకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
నో బ్యాగ్ డే..
ఈ విద్యా సంవత్సరం నుంచి నో బ్యాగ్ డేను అమలు చేస్తున్నారు. ప్రతి నెలా నాల్గవ శనివారం ‘నో బ్యాగ్ డే’గా పాటించనున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు థంబ్ పెయింటింగ్, పేపర్ మాస్క్ మేకింగ్, తోలు బొమ్మలను ఉపయోగించి కథ చెప్పే కళ, పంచతంత్ర పాత్రలను నాటకీయం చేయడం, తోలుబొమ్మల తయారీ, రేఖాగణిత ఆకృతులను ఉపయోగించి 2డీ/3డీ మోడల్ మేకింగ్, హాస్య కవితా సమ్మేళనం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మెరుగైన వసతులు కల్పిస్తున్నాం..
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నాం. నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన మధ్యాహ్నా భోజనాన్ని అందిస్తున్నది. అన్ని రకాల వసతులు ఉండడంతో పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తిని చూపుతున్నారు. బడిబాటలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా కృషి చేశాం.
– దుర్గాప్రసాద్, డీఈవో, నిజామాబాద్
ఏర్పాట్లు పూర్తి..
నెలన్నర కాలంగా వేసవి సెలవులు ఉండడంతో పాఠశాలలు మూతబడ్డాయి. సోమవారం నుంచి బడులు పునః ప్రారంభం కానున్నాయి. దీంతో తరగతి గదులు, పాఠశాలల ఆవరణ శుభ్రం చేయించాం. ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఎండలు తగ్గుముఖం పట్టడంతో స్కూళ్లు తెరుచుకోవడానికి ఎలాంటి ఆటంకం లేకుండా పోయింది.
– రాజు, డీఈవో, కామారెడ్డి