Government School | కోటగిరి, జూలై 12 : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే ఉద్దేశంతో చేపట్టిన అమ్మ ఆదర్శ పథకం పనులు నత్తకు నడక నేర్పేలా ఉన్నాయి. అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద ఉమ్మడి కోటగిరి మండల వ్యాప్తంగా 16, పొతంగల్ మండలంలో 17 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో తాగునీరు, శౌచాలయాలు, తరగతి గదుల నిర్మాణం,ప్రహరీ నిర్మాణాలు వంటి ప్రధాన పనులు చేపట్టాల్సి ఉన్నది. ఎంపిక చేసిన పాఠశాలల్లో పనులన్నింటినీ జూన్ 1వ తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా పనులు కొనసాగుతున్నాయి.
ఉమ్మడి మండలంలోని కొల్లూర్ గ్రామంలో అర్ధాంతరంగా పాఠశాల భవన నిర్మాణం నిలిచిపోయింది. కొల్లూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతులు ఉండగా, అందులో 14 మంది విద్యార్థులు, ఉపాధ్యాయిని ఉన్నారు. కొల్లూర్లోని ప్రభుత్వ పాఠశాల భవనం నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరుకాగా గుత్తేదారుకు బిల్లులు రాకపోవడంతో పనులు నిలిపివేశారు. గతేడాది స్థానిక అంగన్వాడీ కేంద్రంలో తరగతులు నిర్వహించి అనంతరం స్థానిక గ్రామ పంచాయతీ భవనంలో ఇరుకైన గదిలోనే కొనసాగిస్తున్నారు.
కోటగిరి మండలం లింగాపూర్ గ్రామంలో పునాదులకే పరిమితమైంది పాఠశాల భవనం. లింగాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉండగా ఇందులో 16 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో నూతన భవనం నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరయ్యాయి. పనులు మాత్రం పునాదులకే పరిమితమయ్యాయి. గత ఏడాది గ్రామ పంచాయతీ భవనంలో తరగతులు నిర్వహించారు. ఈ ఏడాది కూడా గ్రామ పంచాయతీలోనే చదువులు కొనసాగుతున్నాయి. ఈ బడికి అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా బాలికల మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యానికి రూ. 3 లక్షలు మంజూరయ్యాయి. భవనం లేకపోవడంతో ఆ పనులు సైతం నిలిచిపోయాయి.
లింగాపూర్, కొల్లూర్ గ్రామాల్లో పాఠశాలకు సొంత భవనాలు లేకపోవడంతో అమ్మ ఆదర్శ పాఠశాల కింద మంజూరైన నిధులతో అక్కడ పనులు చేపట్టలేక నిలిపివేశాం. ఈ రెండు గ్రామాల్లో పాఠశాల భవన నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో గ్రామ పంచాయతీలోనే విద్యాబోధన కొనసాగుతున్నది.