వినాయక్ నగర్, సెప్టెంబర్ 24 : అక్రమ సంపాదనకు అలవాటు పడిన ఇద్దరు స్నేహితులు అమాయకులను టార్గెట్ చేసి వారి వద్ద నుండి కోట్ల రూపాయలు దండుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా లో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు అక్రమ సంపాదనకు అలవాటు పడి ప్రజలకు అధిక లాభాల ఆశ చూపించి వారి వద్ద నుండి పెట్టుబడుల రూపంలో కోట్ల రూపాయలు వసూలు చేశారు. తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే మీ డబ్బు రెట్టింపు అవుతుందని, అంతేకాకుండా తాము పెట్టే కంపెనీలో మిమ్మల్ని షేర్ హోల్డర్లుగా పెట్టుకుంటామని నమ్మబలికారు.
వారి మాటలను నమ్మిన వ్యక్తులు తమ డబ్బులను ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఏర్పాటు చేసిన కంపెనీలో పెట్టుబడులుగా పెట్టారు. గత మూడేళ్లుగా కొనసాగుతున్న ఈ తతంగం చివరకు పలువురు బాధితులు మోసపోయినట్లు తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అస్మి కాలనీకి చెందిన మొహమ్మద్ మోహిజ్ ఖాన్, అస్మి కాలనీకి చెందిన సయ్యద్ అహ్మద్ అమీద్ హుస్సేన్ ఇద్దరు స్నేహితులు కలిసి 2022 /2023 లో క్రిప్టో కరెన్సీ పేరుతో స్పెయిమ్ ఎవర్ గ్రీన్ కంపెనీ పేరుతో మల్టీ లెవెల్ మార్కెటింగ్ దందా ప్రారంభించారు.
తమ కంపెనీలో తక్కువ పెట్టుబడిలు పెట్టిన వారికి ఎక్కువ లాభాలతో వాటా ఇస్తామని ప్రచారం చేస్తూ మీరు నిజామాబాద్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలలో సభ్యులతో గుట్టు చప్పుడు కాకుండా సమావేశాలు నిర్వహించారు. అనంతరం వీరు ప్రజల వద్ద నుండి డబ్బులు దండుకొని ఏ విధంగా మోసం చేశారని వివరాలను నిజామాబాద్ సీసీఎస్(సెంట్రల్ క్రైమ్ స్టేషన్) ఏసీపీ నాగేంద్ర చారి తెలిపారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని సీసీఎస్ పోలీస్ స్టేషన్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మోసగాళ్ల వివరాలను ఆయన వెల్లడించారు. తమ కంపెనీ యూఎస్ డాలర్లను ట్రేడింగ్ చేస్తుందని, హైదరాబాద్ ప్రాంతంలో భారీగా కంపెనీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రజలను నమ్మిస్తూ వారి వద్ద నుండి వాటా రూపంలో డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు.
అంతే కాకుండా వీరి వద్ద ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టుబడులుగా పెట్టిన వ్యక్తులను థాయిలాండ్, గోవా లాంటి ప్రాంతాలకు తీసుకువెళ్లి అక్కడ వారిని ఎంజాయ్ సైతం చేయించినట్లు ఏసిపి వెల్లడించారు. అంతేకాకుండా ఢిల్లీ , ఉత్తర ప్రదేశ్ తోపాటు ఇతర చాలా చోట్ల వీరు ఆఫీస్లను ఏర్పాటు చేసి తమ ఏజెంట్ల ద్వారా ప్రజలతే డబ్బులు పెట్టుబడులుగా పెట్టించినట్లు తెలిపారు. ఈ రెండు సంవత్సరాల కాలంలో 125 మంది వద్ద నుండి రూ.8.50 కోట్లు దండుకున్నారు. చివరకు నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తనను ఈ కంపెనీ వారు మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు.
అనంతరం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య దేశాల మేరకు ఈ కేసును తమకు అప్పగించడంతో దర్యాప్తులో భాగంగా తాము దేశవ్యాప్తంగా ప్రజలను మోసగించిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఏసీబీ నాగేంద్ర చారి వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరు పరచన్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సీసీఎస్ సీఐలు రవీందర్, సురేష్ పాల్గొన్నారు.